భారత ఐటీ నిపుణులకు అమెరికా మరో ఝలక్
భారత ఐటీ నిపుణులకు అమెరికా మరో ఝలక్ ఇచ్చింది. హెచ్ 1 బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌పై విధించిన తాత్కాలిక రద్దును మరో ఐదు నెలల పాటు పొడిగించింది. ఈ గడువు సెప్టెంబరు 10తో ముగియాల్సి ఉంది. దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 వరకూ పొడిగిస్తున్నట్లు అమెరికా పౌరసత్వ, వలసల సేవల విభాగం (యూఎస్ఐసీఎస్) ప్రకటించింది. ప్రీమియం ప్రాసెసింగ్ అంటే వీసా దరఖాస్తులను వేగంగా పరిశీలించే వెసులుబాటు. సాధారణంగా వీసా క్లియరెన్స్‌కు ఆరు నెలల దాకా సమయం తీసుకుంటారు. కానీ ప్రీమియం ప్రాసెసింగ్ ద్వారా 15 రోజుల్లో దీన్ని పూర్తి చేయవచ్చు. అంటే కంపెనీలు టెకీలను ఎంపిక చేసుకున్నాక, క్యూలో ఉండి వీసా పొందాల్సిన అవసరం లేకుండా వేగంగా దీనిని సాధించుకోగలుగుతున్నాయి. తాజా నిర్ణయంతో ఆ కంపెనీలు మళ్లీ క్యూలో ఉండి, తమకు కేటాయించిన సమయం ప్రకారం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అనేక ఐటీ కంపెనీలు భారతీయ నిపుణులను సత్వరం ఉద్యోగాల్లోకి తీసుకుని పనిలోకి దింపేందుకు ఎక్కువగా ఈ ప్రీమియం ప్రాసెసింగ్ మార్గాన్ని ఎంచుకుంటాయి. దీనికి అదనంగా 1225 డాలర్లు (రూ 86,181) చెల్లించాలి.













