అమెరికాలోని అర్చకులకు టీటీడీ శిక్షణ
అమెరికాలోని అర్చకులకు శిక్షణ ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సన్నద్ధమవుతోంది. అమెరికాలోని శ్రీవేంకటేశ్వర ఆలయాల్లోని పూజారులకు వర్క్ షాప్ ఆన్ ఆగమిక్ స్టాండర్డ్స్ ఎట్ ఎస్వీ టెంపుల్స్ ఇన్ యూఎస్ఏ పేరిట శిక్షణ ఇవ్వనుంది. పిట్స్బర్గ్లో ఆలయంలో ఈ నెల 29, 30 న ఈ శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. అక్కడి ఆలయాల్లోని హిందూ ఆగమశాస్త్ర ప్రమాణాలు పాటించేలా ప్రధాన పూజారులు, ఆలయ నిర్వాహకులతో టీటీడీ ఆగమ పండితుల బృందం సమావేశమై సూచనలు చేయనుంది.
2010లో టీటీడీ మొట్టమొదటిసారిగా శ్రీనివాస కల్యాణాలను అమెరికాలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐల నుంచి విశేష స్పందన లభించింది. ఆ తర్వాత 2015లో నాలుగు ప్రధాన పట్టణాల్లో శ్రీనివాస కల్యాణాలు వైభవోపేతంగా జరిపించారు. ఈ నేపథ్యంలో తిరుమల తరహాలోనే అమెరికాలోని ఆలయాల్లోనూ ఆగమశాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించేలా సూచనలు, సలహాలు ఇవ్వాలని అక్కడి అర్చకులు కోరారు. దీంతో ముఖ్యమంత్రి సూచన మేరకు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆమోదం కూడా లభించడంతో ఈ నెల 29, 30 తేదీల్లో పిట్స్బర్గ్లో వర్క్ షాప్ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.













