అమెరికా ఆలయాల కోసం వస్తున్న టీటీడి!

(చెన్నూరి వెంకట సుబ్బారావు)
అమెరికాలోని భారతీయులకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. అందుకే తాము ఉన్న చోట శ్రీ వేంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉండాలని ఆశపడ్డారు. వారి కోరికను నెరవేరుస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అమెరికాలో పలు చోట్ల కొలువై కనిపిస్తారు. అమెరికాలో ఉన్న ఎన్నో దేవాలయాల్లో ఎక్కువ దేవాలయాలు శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్నవే కనిపిస్తాయి.
అమెరికా వైశాల్యంలో పెద్దరాజ్యం. ధనికరాజ్యం కూడా. ఉపాధి కోసం అక్కడకు వలస వెళ్ళినవారిలో తెలుగువాళ్ళు, తమిళులు, గుజరాతీలు, మలయాళీలు ఎందరో ఉన్నారు. సాధారణంగా విలాసరాజ్యంలో అడుగుపెట్టినప్పుడు దేవుణ్ణి మరచిపోతారు. డబ్బు మాయలో పడిపోతారు. కాని తమిళులు, తెలుగువాళ్ళు మాత్రం ఉపాధి కోసమే అక్కడకు వెళ్ళినా తమ ఇష్టదైవాన్ని మాత్రం మరవరు. సమయం దొరికినప్పుడు దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని పూజలు చేయాలని అనుకుంటారు. మన సంప్రదాయమైన భక్తి తమిళులు, తెలుగువారిలో కొంత ఎక్కువ.
తొలితరం వాళ్లు అమెరికా వెళ్ళినప్పుడు వారి సంఖ్య కొద్దిగానే ఉండింది. అప్పుడు వారు తమ పూజల కోసం ఇంట్లోని ఓ గదినే కేటాయించుకుని పూజలు చేసేవారు. కాలక్రమేణా భారతీయుల సంఖ్య పెరిగింది. తెలుగువారి సంఖ్య కూడా మూడింతలు కావడంతో అందరూ కలిశారు. తమకోసం ఓ ఆలయాన్ని నిర్మించుకోవాలని భావించారు. అందుకనుగుణంగా చందాలేసుకుని అనుమతులు తీసుకుని దేవాలయ నిర్మాణం చేపట్టారు. దేవాలయం నిర్మాణం కోసం ఇండియా నుంచి మనుషులను తెచ్చుకున్నారు. అవసరమైన శిల్పాలను దిగుమతి చేసుకున్నారు. పూజారులను నియమించుకున్నారు. ఆగమశాస్త్రాను ప్రకారం దేవాలయాన్ని నిర్మించి మందిరంలో విగ్రహాలను సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠింపజేసుకుని పూజా కార్యక్రమాలను చేయడం ప్రారంభించారు. వీకెండ్‌లోనూ, ఇతర మంచి రోజుల్లోనూ, ఇండియాలోలాగానే దేవాలయాలకు రావడాన్ని ఓ కర్తవ్యంగా చేసుకున్నారు. దానికితోడు ఇండియా నుంచి వచ్చిన పెద్దలను దేవాలయాలకు తీసుకురావడంతో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తుంటాయి. తమిళియన్లు, గుజరాతీలు ఎక్కువ సంఖ్యలో అమెరికాలో ఉన్నారు. వారంతా కూడా దేవాలయ స్థాపనలో, అభివృద్ధిలోపాలు పంచుకుంటున్నారు. ఉత్తరాదివారు ఎక్కువగా ఆర్థిక సహాయం అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటారు.
దీంతో ఇప్పుడు అమెరికాలో వందల సంఖ్యలో శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న దేవాలయాలు మనకు కనిపిస్తాయి. భారతీయులు నివసిస్తున్న ప్రతి చోటా ఇప్పుడు ఓ గుడి మనకు కనిపిస్తుంది. అందులో తప్పకుండా శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు.
పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్ ఆలయం మొట్టమొదటి శ్రీ వేంకటేశ్వర దేవాలయం. 1975లో ఈ ఆలయ నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. 1976 నవంబర్‌లో విగ్రహ ప్రతిష్ఠాపన, 1977లో మహాకుంభాభిషేకం, 1978లో రాజగోపుర నిర్మాణం వంటివి జరిగాయి. పిట్స్‌బర్గ్ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ ఆండాళ్, గణేష్‌లు మూలవిరాట్‌లుగా కొలువై భక్తుల పూజలందుకుంటున్నారు.
కాలిఫోర్నియాలో మలిబు హిందూ టెంపుల్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారు. 1981లో ఈ దేవాలయం ప్రారంభమైంది.
లివర్‌మోర్‌లో ఉన్న శ్రీ శివ విష్ణు టెంపుల్‌లో కూడా శ్రీ వేంకటేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. యుఎస్‌లో ప్రాచీనమైన దేవాలయాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.
న్యూజెర్సిలో తిరుమల వెంకన్నకు ప్రతిరూపంగా ‘బాలాజి మందిర్’ భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నది. హిందూ టెంపుల్ అండ్ కల్చరల్ సొసైటీ ఆఫ్ యుఎస్‌ఎ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ మందిరాన్ని నిర్మించారు. శ్రీ వేంకటేశ్వర ఆలయంగా పేరు పొందిన ఈ దేవాలయం హిందూవుల ఆధ్యాత్మిక కేంద్రంగా మారి ఎన్నారైలను విశేషంగా ఆకట్టుకుంటోంది. 1998లో టెంపుల్ సొసైటీ ఆధ్వర్యంలో కుంభాభిషేకంను వైభవంగా నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి ఎందరో భక్తులు దాదాపుగా 12వేలమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండియా నుంచి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, ముత్తుకృష్ణ గురుకల్ తదితరులు హాజరై వేడుకలను దగ్గరుండి జరిపించారు.
న్యూజెర్సిలోని రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో అతి పెద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. భారీ ఖర్చుతో నిర్మించి ఈ దేవాలయం ప్రపంచంలోని భక్తులను ఆకర్షిస్తోంది.
చికాగోలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. విశాలమైన ప్రదేశంలో నిర్మించిన ఈ దేవాలయం భక్తుల పూజలను అందుకుంటోంది.
నార్త్ కరోలినాలోని కారీలో, అరిజోనా రాష్ట్రంలోని టంపాలో, కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్‌లో, ఫ్లోరిడాలో కాసియాబెర్రి, మిన్నెసొటాలోని ఎడినా, మిస్సోరిలో సెంట్‌లూయిస్, మిచిగాన్‌లోని నోవి, ఒహాయోలో రిచ్‌ఫీల్డ్, పావెల్, ఓరెగాన్‌లోని హిల్స్‌బోరో, టెక్సాస్‌లోని అస్టిన్, వాషింగ్టన్ లోని ఫెయిర్‌ఫాక్స్‌లో, కెనడాలోని ఒంటారియో, జార్జియా రివర్‌డాలే, ఇల్లినాయిస్‌లో విస్‌కాన్సిన్, మేరీలాండ్‌లోని వాషింగ్టన్‌డీసి ఇలా పలు దేవాలయాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇలా ప్రతిచోటా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని భక్తులు సందర్శించడమే కాకుండా స్వామి సేవలో పాల్గొంటున్నారు.
అమెరికాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు పెద్దఎత్తున హాజరై స్వామివారి మీద తమ భక్తిని చాటుకుంటున్నారు. 2010లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో, తెలుగుటైమ్స్, స్థానిక ఆలయాల సహకారంతో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ‘శ్రీనివాస కళ్యాణం’ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అప్పటి నుంచి టీటీడి ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలోనే తరలివస్తున్నారు. డల్లాస్‌లో జరిగిన టీటీడి శ్రీనివాస కళ్యాణం సమయంలో ఇక్కడ ఉన్న కొంతమంది ఆలయ ప్రముఖులు, ఇతరులు తమ ఆలయాల్లో కూడా తిరుమలలో జరిగినట్లుగానే ఆగమశాస్త్ర ప్రకారం పూజలు జరిగేందుకు సహాయ పడాలని కోరారు. అందుకు అంగీకరించిన టీటీడి, వారి కోరిక మేరకు సెప్టెంబర్ 29, 30 తేదీల్లో పిట్స్‌బర్గ్‌లో టీటీడి ఆగమశాస్త్ర పండితులతో వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసింది. ఈ వర్క్‌షాపులో టీటీడి ఆగమ పండితులు ఆలయాల్లో జరగాల్సిన నిత్యపూజలతోపాటు, ఇతర సందర్భాల్లో అనుసరించాల్సిన పద్ధతులు, పూజలపై తెలియజేస్తారని టీటీడి జెఇఓ పోలాభాస్కర్ తెలిపారు. టీటీడి ఆగమపండితులు రూపొందించిన గైడ్‌లైన్ పుస్తకాన్ని కూడా ఈ వర్క్‌షాపులో అందిస్తారని చెప్పారు. ఈ పుస్తకం అన్నీ హిందూ దేవాలయాలకు ఉపయోగపడుతుందని కూడా ఆయన వివరించారు. ఈ వర్క్‌షాప్‌కు అమెరికాలోని ఆలయాలను ఆహ్వానిస్తున్నట్లు టీటిడి ప్రకటించింది.
On Line Registrations : registrations.tirumala.org