చైనాకు ట్రంప్ తాజా హెచ్చరిక
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు వైఖరితో ఇప్పటికే ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల పోరు, ప్రపంచ దేశాలనే వణికిస్తున్న విషయం తెలిసిందే. మళ్లీ చైనాపై ఏకంగా 200 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14 లక్షల కోట్లు) అదనపు సుంకాలను విధిస్తామంటూ ట్రంప్ చేసిన తాజా హెచ్చరిక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు పెను ప్రకంపలను సృష్టిస్తున్నది. అమెరికా సుంకాలపై ప్రతిగా మేమూ సుంకాలను వేస్తామని గత వారం చైనా చేసిన ప్రకటన కార్యరూపం దాల్చితే అదనంగా ఆ దేశ ఉత్పత్తులపై 200 బిలియన్ డాలర్ల సుంకాలను వేసేందుకు ఏమాత్రం వెనుకాడబోమని ట్రంప్ సర్కారు చేసిన ప్రకటన కలవరపాటుకు గురిచేస్తున్నది.
చైనాతో అమెరికా వాణిజ్య లోటు 376 బిలియన్ డాలర్లుగా ఉండటాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణించి సుంకాల పోరుకు తెరతీసిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికావి బెదిరింపు వ్యూహాలపై చైనా మండిపడింది. చైనా దోపిడీ ఆర్థిక విధానాలు ప్రపంచ దేశాల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ విరుచుకుపడ్డారు.













