రూ.6వేల కోట్లు నష్టపోయిన డొనాల్డ్ ట్రంప్
ప్రముఖ వ్యాపారవేత్త, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 1980 నుంచి 1990 మధ్య కాలంలో నిర్వహించిన వ్యాపారంలో దాదాపు 1 బిలియన్ డాలర్లు (రూ.6,967 కోట్లు) నష్టపోయినట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ట్రంప్ సంబంధించిన రిపోర్టును న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. దీనిలోని వివరాల ప్రకారం 1985లో కాసినోస్, హోటల్, అపార్ట్మెంట్ రిటైల్ బిల్డింగ్స్ ద్వారా ట్రంప్ 46.1 మిలియన్ డాలర్లు నష్టపోయారు. 1994లో 1.17 బిలియన్ డాలర్లు నష్టపోయారు. వ్యాపారంలో నష్టాలను చవిచూసినందుకే 1987లో ట్రంప్ పన్నుల ఎగవేతకు పాల్పడినట్టు ఐఆర్ఎస్ ట్రాన్స్క్రిప్ట్స్ పేర్కొంది. 2016, అక్టోబర్లో న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థ 1995లో ట్రంప్ టాక్స్రిటర్న్స్కు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. ఆ ఏడాదిలో ట్రంప్ 916 మిలియన్ డాలర్లు నష్టపోయినట్టు ఐఆర్ఎస్ ట్రాన్స్క్రిప్ట్స్ తన నివేదికలో తెలిపింది. 1990లో ట్రంప్ 250 మిలియన్ డాలర్లు నష్టపోయారు. అదే ఏడాది ఆయన తాజ్మహల్ హోటల్, కాసినోలను ప్రారంభించారు. వీటి నిర్వహణలో విఫలమైనందున ఆయన 800 మిలియన్ డాలర్లు నష్టపోయారు.













