ఆ దేశంపై దూకుడొద్దని ట్రంప్ కు చెప్పండి!
ఇరాన్ విషయంలో దూకుడుగా వ్యవహరించొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నచ్చజెప్పాలని అమెరికా అధికారులు కాంగ్రెస్ ఉభయసభల సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఇస్లామిక్ స్టేట్ సంస్థ మాదిరిగా ఇరాన్ విషయంలో దూకుడుగా వ్యవహరించవద్దని అధ్యక్షుడికి చెప్పాలని అధికారులు తమను కోరినట్లు ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల సభా సంఘం చైర్మన్ ఎలియెట్ ఏంజెల్ మీడియాకు తెలిపారు. విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, త్రివిధ దళాల సంయుక్త కమిటీ చైర్మన్ జనరల్ జోసెఫ్ డన్ఫోర్డ్, తాత్కాలిక రక్షణ మంత్రి పాట్రిక్ షనాహన్ తదితరులు అటు రిపబ్లికన్, ఇటు డెమొక్రాటిక్ ఎంపీలతో జరిగిన ఈ భేటీలో పాల్గొన్నారని ఆయన వివరించారు. ఇరాన్‌తో ఉద్రికత్తలు పెరగటంపై గత కొన్ని వారాలుగా తాము మరింత సమాచారం సేకరించినట్లు చెప్పారు. మధ్యప్రాచ్యంలో యుద్ధానికి వెళ్లే ఉద్దేశం ఎవరికీ లేదని, అధ్యక్షుడి ఆదేశాలతో అక్కడ యుద్ధ విమాన వాహకనౌక, యుద్ధ విమానాల మోహరింపుతో ఉద్రికత్తలు తారస్థాయికి చేరుకున్నాయని విదేశీ వ్యవహారాల సభా సంఘం ప్రతినిధి మైక్ మెల్ కాల్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్‌తో సభ్యులతో చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడిన రక్షణ మంత్రి షనాహన్ మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచాలని తాము కోరుకోవటం లేదని సృష్టం చేశారు.













