జమైకా సుందరికి మిస్ వరల్డ్ కిరీటం
మిస్ వరల్డ్ 2019 అందాల కిరీటం జమైకా సుందరి 23 ఏళ్ల టొని ఆన్ సింగ్కు దక్కింది. లండన్ లోని ఎక్సెల్ లండన్లో నిర్వహించిన మిస్ వరల్డ్ 2019 విజేతలను ప్రకటించారు. గతేడాది మిస్ వరల్డ్ మెక్సికో సుందరి వెనెస్సా పొన్స్ డీ లియోన్ మిస్ వరల్డ్ కిరీటాన్ని టొని ఆన్ సింగ్కు బహుకరించింది. భారత్, ఫ్రాన్స్ పోటీదారులు టొని ఆన్ సింగ్కు చివరి వరకూ పోటీనిచ్చారు. భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన సుమన్ రావు రెండవ స్థానంలో నిలవగా.. ఫ్రాన్స్ సుందరి ఒఫ్లీ మెజినో మూడవ స్థానంలో నిలిచింది. ఇదిలావుడంగా 23 ఏళ్ల టొని ఆన్ సింగ్ తండ్రి ఇండో- కరేబియన్ కాగా తల్లి ఆఫ్రికన్- కరేబియన్. టొని ఆన్ సింగ్ ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఉమెన్స్ స్టడీస్ అండ్ సైకాలజీ చదువుతున్నారు. మిస్ వరల్డ్ పోటీలో టోని ఆన పాడిన పాటకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
మిస్ వరల్డ్ కిరీటం దక్కడంపై టొని ఆన్ సింగ్ ఇస్టాగ్రాం వేదికగా స్పందించారు. తనపై నమ్మం ఉంచిన జమైకన్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నాపై నాకు నమ్మకం కలిగేలా వెన్నుతట్టిన మీకు రుణపడి ఉంటాను. 69వ మిస్ వరల్డ్ నిలవడం కేవలం నా ఒక్కదాని గొప్పకాదు. నాకెంతో ఇష్టమైన మా అమ్మ, కుటుంబ సభ్యులు, స్నేహితులు, నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.













