కరోనా టైంలో భారత సైంటిస్టుల శ్రమను కళ్లకు కట్టిన ‘ది వ్యాక్సీన్ వార్’
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని కమ్మేసింది. అగ్రరాజ్యం అమెరికా నుంచి అన్ని దేశాల్లో ప్రజలు ఈ మహమ్మారి కోరలకు బలి అవుతూ వచ్చారు. ఇలాంటి సమయంలో వ్యాక్సీన్ తయారు చేయడానికి పెద్ద దేశాలు కూడా చాలా కష్టాలు పడ్డాయి. చివరకు వ్యాక్సీన్లు తయారు చేసినా కూడా చిన్న దేశాలకు వాటిని ఇవ్వలేదు. ముందు తమ దేశంలో వాడుకున్న తర్వాత.. ఏమైనా వ్యాక్సీన్లు మిగిలితే చిన్న దేశాలు ఇస్తామనే ధోరణిని కనబరిచాయి. ఇలాంటి సమయంలో భారత సైంటిస్టులు ఎన్నో కష్టాలు పడి సొంత వ్యాక్సీన్లు తయారు చేశారు. భారత్ బయోటెక్ వంటి కంపెనీల్లో శాస్త్రవేత్తలు కుటుంబాలకు దూరంగా ఉంటూ అహోరాత్రులు కష్టపడి వ్యాక్సీన్ తయారు చేశారు. ఆ తర్వాత వీటిని భారత ప్రభుత్వం ఇతర చిన్న దేశాలకు పంపిణీ చేసి పెద్ద మనుసు చాటుకుంది. ఇదే ఇతివృత్తంపై ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రీ ఒక సినిమా తీశారు. ‘ది వ్యాక్సీన్ వార్’ అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అగ్రరాజ్యంలోని భారతీయులకు ప్రత్యేకంగా షో వేసి చూపించారు. ఇది చూసిన ప్రవాస భారతీయులంతా కూడా భారతీయులమని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామన్నారు. ఈ చిత్రం చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయామని చెప్తున్నారు. సైంటిస్టుల కష్టాలు, తపన తమను కన్నీళ్లు పెట్టించాయన్నారు.
ఈ వ్యాక్సీన్ వార్ చిత్రంలో మ్యూజిక్ లాంచ్ కార్యక్రమం న్యూయార్క్ టైం స్క్వేర్లో జరిగింది. ఇక్కడ మ్యూజిక్ లాంచ్ చేసిన తొలి భారతీయ చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈ విశ్వం ఎలా మొదలైంది? అని ఋగ్వేదంలో చెప్పిన ‘నాసదీయ సూక్తం’ పాట కూడా ఈ చిత్రంలో ఉంది. ఈ మూవీ మ్యూజిక్ లాంచ్ సందర్భంగా ఈ సూక్తను కథక్ నృత్యంలో ప్రదర్శించారు. దీన్ని చూసేందుకు చాలా మంది భారతీయులు టైం స్క్వేర్ చేరుకున్నారు.













