టాంటెక్స్ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 152 వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 152 వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో ఘనంగా డాలస్ లో నిర్వహించబడింది. కరోన వైరస్ కారణంగా మొదటి సారి సాహిత్య సదస్సుని ఆన్ లైన్ లో నిర్వహించడం జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 152 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. ఆన్ లైన్ లో నిర్వహించినప్పటికీ డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో ఈ సదస్సుకి విచ్చేసి, జయప్రదం చేసారు.
సాహిత్య మరియు సింధు ల ‘రఘుపతి రక్షకుడనీ ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత డా.నరసిమ్హా రెడ్డి ఊర్మిండి మన తెలుగు సిరిసంపదలు ధారావాహికని కొనసాగించారు. నర్సింహారెడ్డి గారు మాట్లాడుతూ సిరిసంపదల్లో భాగంగా కొంగుబంగారం, గోరోజనం, గోడచేర్పు, కుండోదరుడు (లంచం బాగా తినేవాళ్ళని), కూరకాయ కవిత, గొంతెమ్మ కోరిక, గోవచ్చం (ప్రత్యేక వ్యక్తిత్వం లేని వారు), గోవింద కొట్టడం, గౌతముడి గోవు లాంటి జాతీయాల నేపధ్యం గురించి వివరించారు.
ఆ తర్వాత సథ్యం ఉపద్రష్ట గారు చమత్కార కవిత్వం గురించి వివరించారు ..ఆశు, మధుర, చిత్ర, విస్తరాలనే చతుర్విధ కవిత్వాలలో “ఆశుకవిత్వం” మొదటిది. “ఆశుకవిత్వం” అవధానులకు ఆరాధ్య దైవం. ఈ శక్తి ఎంత అధికంగా వుంటే వారికి అంత కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయని చెప్పారు.
లెనిన్ గారు మాట్లాడుతూ ఆన్లైన్ లో ఇలా సాహిత్య సదస్సు ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంస్కృతం అనగానే ఆధ్యాత్మిక సాహిత్యం, జ్యోతిష్యం మంత్రాలు, వేద సాహిత్యం అనుకుంటాం కాని సంస్కృతంలో ఎంత ఆధ్యాత్మిక సాహిత్యం వున్నదో లౌకిక సాహిత్యం,గణిత శాస్త్రం కూడా అంతే ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా విస్తారంగా బహు శాఖలు, విజ్ఞానం, శాస్త్రీయత ఇమిడి ఉన్నాయని చెప్పారు.
లలితానంద్ గారు కరోనా పేరు మీద ధిక్కారం పేరు తో కవిత చదివారు.
కరుణించు కరోనా..కాపాడు కరోనా
సరిహద్దులు చెరిపేసావు ..గుండెల్లో గుబులు కరోనా
నీకు మందేలేదట ..ఎట్లా బతుకాలే.
ఎం మాయ చేసావె..ప్రకృథి విక్తృతాయె
నీకు అందరూ సమానమాయె ….కరుణించు కరోనా..కాపాడు కరోనా
డా.ఉమా దేవిగారు భాగవతం లోని శ్లోకాన్ని వినిపించారు.
ముఖ్య అతిధి శ్రీ రమణరావు గారు తెలుగు కథా పరిణామం పై చేసిన ప్రసంగం అందరిని తెలుగు భాష మరియు భక్తి రసంలో ముంచెత్తింది.
డా. కే.వి. రమణరావు స్వంతవూరు కడపజిల్లా తిమ్మసముద్రం గ్రామం. చదువుసాగింది కడప, తిరుపతిలలో. వృక్షశాస్త్రంలో పిహెచ్ డి అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, ఉన్నత విద్యా మండలిలో, రాజీవ్ గాంధీ యూనివర్సిటిలో పనిచేసి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ప్రిన్సిపాల్ గా రిటైరయ్యారు. అతని శ్రీమతి పేరు సుభద్ర, సంగీతం ఆమె అభిరుచి. వారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇద్దరూ స్థిరపడ్డారు.
డా. కామరాజు వెంకటరమణరావుకు చిన్నప్పటినుంచి సాహిత్యం పట్ల మక్కువ. కాలేజిరోజుల్లో ప్రసిద్ధ ఆంగ్ల, తెలుగు రచనలతో పరిచయం. గురజాడ, చాసో, జాషువ, బుచ్చిబాబు, చండీదాస్ రచనల నుంచి అతను స్పూర్తి పొంది 2005 నుంచి కథలు రాయడం ప్రారంభించారు.
డా. రమణరావు కథలు ఇప్పటిదాకా 45 కి పైగా అన్ని ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. సాహిత్య విమర్శ, ఉన్నతవిద్యకు సంబంధించి అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ఇతని 26 కథలను ‘పుట్టిల్లు’ పేరుతో సంకలనంగా 2013 లో ప్రచురించారు. ఇతనికి 2016లో ప్రతిష్టాత్మకమైన ‘చాసో స్పూర్తి’ అవార్డు ప్రదానం చేసారు.
2019 లో ఇతని కథలమీద ‘కథారూప లక్షణాలు’ అనే విమర్శక గ్రంధాన్ని డా. టి.జి.ఆర్. ప్రసాద్, డా. వి. శ్రీధర్ లు వెలువరించారు. కొన్ని వ్యాసాలు కూడా ప్రచురింపబడ్డాయి. డా. రమణరావు రచనా వ్యాసంగాన్ని ఒక బాధ్యతగా భావిస్తారు. రచనలు సామాజిక చైతన్యానికి దోహదపడాలని వారు విశ్వసిస్తారు.
డా. రమణరావు గారు “తెలుగు కథా పరిణామం” అనే అంశం మీద మాట్లాడుతూ కథలో ఉన్న కథా ప్రయోజనం, శిల్పం, వస్తువు అనే మూడు భాగాలుంటాయని చెప్పారు.
1879 లో తెలుగు లో మొదటి కథ మొదలైందని కాని 1910 లో గురజాడ రాసిన ‘దిద్దుబాటూ అనే కథ ద్వారానే ఆధునికత కథ మొదలైందని చెప్పారు. అందుకనే గురజాడని ఆధునిక కవి అన్నారని చెప్పారు. ప్రయోజనంలో సామాన్యక మార్పు ఉంటేనే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారని చెప్పారు. గురజాడ గారు వస్తు ప్రయోజనం లోనే కాకుండా శిల్పం లో కూడా సామాజిక మార్పుని తీసుకొని వచ్చారని చెప్పారు. అలాగే కథలో వాడుక భాష ప్రాధాన్యతని వివరించారు. కాలక్రమంలో కథలోని వస్థువు ఎలా మారిందో వివరించారు .1930-50 మధ్య కాలంలో, 1950-70 మధ్య కాలంలో, 1970-90 మధ్య కాలంలో, 1990-2010 మధ్య కాలంలో కథా వస్తువు ఎలా మారిందో వివరించారు.
కథకి, కథా పేరుకి సంబంధం ఉండాలని చెప్పారు. కథలోని వస్తువు ఆలోచింపజేసేదిగా ఉండాలన్నారు. కథకి కాలమానం కూడ అవసరమని చెప్పారు…కథలో పాత్రలు లేకుండా కూడా కథ వుండొచ్చన్నారు.. వస్తు కథ ఎప్పుడూ శిల్పాన్ని ప్రయోజనాన్ని సమతుల్యం చేస్తూ ఉండాలన్నారు. కథ లో ఎప్పుడూ వర్తమాన నేపథ్యం కలిగి ఉండడంతో పాటుగా ఎక్కువ మందికి నచ్చే విధంగా ఉంటేనే ఆ కథ విజయవంతమవుతుందని చెప్పారు.
డా. రమణరావు గారి సతీమణి సుభద్ర గారు కొమ్మలో కోయిలా కుహూ అంటదీ అనే లలిత గీతంతో కార్యక్రమాన్ని ముగించారు…ఈ కార్యక్రమం దాదాపు మూడూ గంటలపాటు జరిగినప్పటికీ అప్పుడే అయిపొయిందా? అనిపించింది.
ఈ కార్యక్రమం తిరుమల రెడ్డి కంభం కల్పించిన జూం ద్వారా ప్రత్యక్ష ప్రసారం కావడంతో అమెరికా నలుమూలల నుండి ఎంతో మంది వీక్షించారు. అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు మాట్లాడుతూ, సాహిత్యం మీద ప్రేమ, అమ్మ భాష మీద మమకారం తో ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ముందు ముందు నిర్వహించే నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సులకి అధిక సంఖ్యలో పాల్గొని భాషాభిమానాన్ని చాటిచెప్పమన్నారు.
ఈ కార్యక్రమంలో పూర్వాధ్యక్షులు సుబ్రమణ్యం జొన్నలగడ్డ, చంద్ర కన్నెగంటి, రాయవరం భాస్కర్, సురేష్ కాజా, ప్రసాద్ తోటకూర, కిరణ్మయి గుంట, చిన సత్యం వీర్నపు, రవి పట్టిసం, శశికళా పట్టిసం, రాజారెడ్డీ, పివి రమారావు, విష్ణు ప్రియ, జగదీశ్వరన్ పూదూరు మొదలగు సాహితీ ప్రియులు హాజరయ్యారు. జూం సౌకర్యాన్ని కల్పించిన తిరుమల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ రమణ రావు గారికి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం తరుపున ధన్యవాదాలు.













