తానా ఆధ్వర్యంలో ఘనంగా కాళోజీ జయంతి.. తెలంగాణ ప్రముఖ కవుల హాజరు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9వ తేదీన కాళోజి జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులను ఆత్మీయ అతిధులుగా తానా ఆహ్వానించింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా. కే.వి. రమణ (రిటైర్డ్ ఐఎఎస్), తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్‌తోపాటు ప్రముఖ కవులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, జె.కె. భారవి, డా. అందెశ్రీ, డా. సుద్దాల అశోక్ తేజ, ఆచార్య కాత్యాయని విద్మహే, గోరెటి వెంకన్న, డా. వడ్డేపల్లి కృష్ణ, రామోజు హరగోపాల్, డా. కోయి కోటేశ్వరరావు, డా. బెల్లి యాదయ్య, ఆచార్య బన్న ఐలయ్య, డా. ఎస్. రఘు, మడిపల్లి దక్షిణామూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చారు.
ఈ కార్యక్రమం సందర్భంగా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ, రామాచారి, సాకేత్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ గేయాలను ఆలపించారు. తానా అధ్యక్షుడులు జయ్ తాళ్ళూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కృషి చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ, భాషా పరిరక్షణ కోసం తానా చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అమెరికాలోని ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు భాషను నేర్పించటానికి పాఠశాల పేరుతో విద్యాకేంద్రాలను ఏర్పాటు చేసి, నాలుగు సంవత్సరాల విద్యా ప్రణాళికను అమలు చేస్తోంది. అమెరికాలోని అనేక నగరాల్లో దీనిని విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ఈ పాఠశాల కేంద్రాలను ఇతర దేశాల్లో కూడా విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాము. తెలుగు సాహిత్యంకోసం ప్రత్యేకంగా తానా ప్రపంచ సాహిత్య వేదికను ఏర్పాటు చేశాము. తెలుగు భాషా ప్రియులను, భాషాభిమానులను, సాహితీ వేత్తలను, ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి భాషా వికాసానికి తోడ్పడాలి అనేది ఈ వేదిక ప్రధాన ఉద్దేశం. ఈ రోజు ‘తెలంగాణ భాషా దినోత్సవాన్ని’ జరుపుకుంటున్నాం. తొలి తెలుగు శతకాన్ని రచించిన పాల్కురికి సోమనాథుడు, తీయనైన భాగవత పద్యాలు రచించిన బమ్మెర పోతన, సుప్రసిద్దమైన సుమతీ శతకం రాసిన బద్దెన,శ్రీ రాముని పై అద్భుతమైన కీర్తనలు రాసిన భక్తరామదాసు, ‘నా తెలంగాణా కోటి రతనాల వీణ’’ అన్న దాశరథి, ప్రజాకవి కాళోజీ, సుద్దాల హనుమంతు, పి.వి.నరసింహారావు, బిరుదురాజు రామరాజు, గూడ అంజయ్య,జ్ణానపీఠ పురస్కార గ్రహీత సీ.నారాయణరెడ్డి వంటి వారితో పాటు వందలాది, వేలాది మంది కవులు,పండితులు ఈ గడ్డమీద పుట్టి తెలుగు భాష కి, యాసకి సాహిత్యానికి వన్నె తెచ్చారని జయ్ తాళ్ళూరి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ప్రసాద్తోటకూర తొలుత అతిధులను స్వాగతిస్తూ, తానా ప్రపంచసాహిత్య వేదిక లక్ష్యాలను, కృషిని వివరించారు. చిగురమళ్ళ శ్రీనివాస్ కూడా తానా ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి సాహితీవేత్తలను ప్రోత్సహించి, గౌరవించడంతోపాటు వారి ద్వారా తెలుగు సాహిత్యాన్ని అందరికీ పరిచయం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన కవులంతా వివిధ అంశాలపై మాట్లాడుతూ, తెలుగు సాహిత్య వైభవాన్ని చాటి చెప్పారు.













