తామా కార్యాలయంలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
అట్లాంటా నగరంలోని తామా కార్యాలయంలో ఆగష్టు 15 వ తారీఖున 72 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దేశభక్తి స్ఫూర్తి తో ఈ వేడుకలు జరిగాయి. కార్యాలయాలకు, వ్యాపారాలకు, పాఠశాలలకు సెలవు రోజు కానప్పటికీ, ఈ జెండా పండుగలో ఎందరో పెద్దలు, యువత, చిన్న పిల్లలు, స్వచ్ఛంద సేవకులు, తామా కార్యవర్గ, బోర్డు సభ్యులు మరియు ఇతర సంస్థల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తామా ప్రెసిడెంట్ మనోజ్ తాటికొండ ప్రారంభోపన్యాసం చేసి, అందరినీ ఈ వేడుకలకు ఆహ్వానం పలికి, విచ్చేసినందుకు క తజ్ఞతాభినందనలు తెలియజేసారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కిశోర జెండా ఎగుర వేశారు. అందరూ జాతీయ గీతం ఆలపించి జెండా వందనము చేశారు. తామా వారు పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. డాక్టర్ కిశోర్ మాట్లాడుతూ, భావితరాలు ఇలాంటి కార్యక్రమాలలో ఇంకా ఎక్కువగా పాల్గొనవలసిన ఆవశ్యకతను వివరించారు, అవసరమైతే తల్లిదండ్రులు ఈ విషయమై కొంత శ్రమ తీసుకోవలసి వస్తుందన్నారు. విశ్రాంత ప్రధానాచార్యులు రవిప్రకాష్ ముసిని స్వాతంత్య్రం ప్రాముఖ్యత గురించి, దేశ నాయకులు, వారి త్యాగాలను విశదీకరించారు. విశ్రాంత ఆచార్యులు ప్రభాకర్ కడియాల హింస మరియు అహింస గురించి విపులీకరిస్తూ, తన చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్నారు.
తామా బోర్డు సభ్యులు విజు చిలువేరు, రాజు మండపాటి స్వాతంత్య్ర దినోత్సవ విశేషాలు తెలిపి, తామా వారు నిర్వహించే ఉచిత వైద్యశాల, విద్యార్థులకు ప్రోత్సాహకాలు, సేవ, సాంస్క తిక మరియు సాహిత్య కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేసారు. తామా బోర్డు ఛైర్మన్ మహేష్ పవార్ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.













