తెలంగాణలో సిలికాన్ వ్యాలీ పెట్టుబడులు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, దీనికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి, అందుబాటులో ఉన్న వనరుల సౌకర్యాలను మంత్రి వారికి వివరించారు. మొదట ఇంటల్ కంపెనీ గ్రూప్ ప్రెసిడెంట్ (మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ సేల్స్) స్టాసీ స్మిత్‌తో పాటు కంపెనీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ రాబెర్ట్ హెచ్ స్వాన్‌తో ఇంటెల్ ప్రధాన కార్యాలయంలో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రగతిని, వ్యాపార అవకాశాలను పరిశీలించేందుకు ప్రతినిధి బృందంతో రావాలని కోరారు.
ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో ఒకటైన ఫెక్స్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ కంపెనీ అధ్యక్షులు డగ్బ్రిట్తో సమావేశం అయ్యారు. తెలంగాణ ఎలక్ట్రానిక్స్ పాలసీ, పారిశ్రామిక విదానాల గురించి వివరించిన మంత్రి, తెలంగాణలో కంపెనీ పెట్టుబడులకు పూర్తిగా సహకరిస్తామని, తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల పాలసీలను తమ ఇండియా ప్రతినిధులు పరిశీలించారని, తెలంగాణ లాంటి రాష్ట్రాలు పరిశ్రమలకు మంచి ఊతం ఇచ్చేలా ఉన్నాయని డగ్ బ్రిట్ తెలిపారు.
క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ క్లౌడ్ ఏరా కంపెనీతో మంత్రి సమావేశం అయ్యారు. కంపెనీ సీనియర్ ఉపాధ్యక్షుడు దానియల్ స్ట్రూమాన్ ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు. క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా రంగంలో ఉన్న అవకాశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్, పోలీసు, రెవెన్యూ విభాగాల్లో ఉపయోగిస్తున్న డాటా అనాలిటిక్స్ కార్యక్రమాలను వివరించారు. గ్లోబల్ ఫౌండ్రీస్ సిఈఓ సంజయ్ జాతో సమావేశం అయ్యారు. టి వర్క్స్ ద్వారా చేస్తున్న డిజైన్లు, ప్రొడక్టు పరిశోధనల ప్రోత్సాహానికి చేస్తున్న ప్రయత్నాన్ని సంజయ్ అభినందించారు. సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టు రాం శ్రీరాంతో మంత్రి సమావేశం అయ్యారు. హైదరాబాద్ నగరంలో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టంపైన, టి హబ్ ద్వారా దానికి లభిస్తున్న ప్రోత్సాహాన్ని మంత్రికి వివరించారు. ఈ సందర్బంగా వారు సెప్టెంబర్ నెలలో టి హబ్ పర్యటనకు వస్తానని హామీ ఇచ్చారు.













