అమ్మకానికి డొనాల్డ్ ట్రంప్ పెళ్లి జరిగిన హోటల్
న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌ను విక్రయించేందుకు సహారా ఇండియా పరివార్ ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిని కొనుగోలు చేసే కొనుగోలుదారుని వెతికేందుకు జోన్స్లాంజ్ లాసేల్ ఇంక్‌ను మధ్యవర్తిగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని జెఎల్ఎల్ సంస్థ డైరెక్టర్ జెఫ్డేవీస్ ధ్రువీకరించారు. గతంలో ఈ హోటల్లో కొంచెం భాగాన్ని అప్కేన్జీ ఎక్విజైషన్స్ సంస్థ కొనుగొలు చేసింది. దీనిని సౌదీ రాజకుటుంబానికి చెందిన అల్వీద్ బిన్ తలాల్ కూడా భాగస్వామి. ప్రస్తుతం ఈ విక్రయం విషయమై సహారా, అష్కేన్జీ, అల్వీద్ కింగ్డమ్ హోల్డింగ్స్ స్పందించలేదు. జెఎల్ఎల్ను మధ్యవర్తిగా నియమించిన విషయాన్ని ఓ ఆంగ్లపత్రిక బయపెట్టింది. సహారా పరివార్ ఇప్పుడు విక్రయానికి పెట్టిన ది ప్లాజా హోటల్‌కు 110 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది న్యూయార్క్‌లోని అత్యంత కీలకమైన ఫిఫ్త్ ఎవెన్యూలో ఉంది. ఇది ఎన్నో చారిత్రక ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో వివాహం కూడా ఇక్కడే జరిగింది. ఒకప్పటీ దీని యజమానుల్లో ట్రంప్ కూడా ఒకరు. దీనిని విక్రయించేందుకు సుబ్రతో రాయ్ రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.













