డొనాల్డ్ ట్రంప్ సర్కారులో మరో వికెట్ డౌన్
2016 నాటి అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తునకు ప్రత్యేక సలహాదారు ముల్లర్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించిన అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ రాడ్ రోజెన్‌స్టీన్ తాజాగా రాజీనామా బాట పట్టారు. ముల్లర్ నివేదిక వెల్లడి తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 11వ తేదీ నుండి అమల్లోకి వచ్చే విధంగా తన రాజీనామా లేఖను అధ్యక్షుడు ట్రంప్‌కు పంపారు. దేశానికి సేవ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. అయితే ఆయన తన రాజీనామా లేఖలో ప్రత్యేక సలహాదారు ముల్లర్ ప్రస్తావన తీసుకురాలేదు. రోజెన్‌స్టీన్ వారసుడిగా ప్రస్తుతం రవాణా విభాగంలో ద్వితీయశ్రేణి ఉన్నతాధికారిగా వున్న జెఫ్రీ రోజెన్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.
సెనేట్ ఆమోదం అనంతరం ఆయన తన నూతన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గత ఫిబ్రవరిలో అటార్నీ జనరల్ విలియం బ్రార్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే రోజెన్‌స్టీన్ తన పదవికీ రాజీనామా చేయాలని భావించినట్లు స్థానిక మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. అయితే ముల్లర్ కమిషన్ దర్యాప్తు ముగిసే వరకూ పదవిలో వుండాలని బ్రార్ ఆయన్ను కోరినట్లు తెలుస్తోంది. నాటి ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ ప్రచార శిబిరంపై వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలను ప్రత్యేక సలహాదారు కమిషన్ సేకరించలేకపోయిందని బ్రార్, రోజెన్‌స్టీన్ తమ నివేదికలో వెల్లడించారు.













