ట్రంప్ మాజీ సలహాదారుకు 40 నెలల జైలు శిక్ష
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, మాజీ సలహాదారు రోజర్ స్టోన్‌కు అమెరికా జిల్లా కోర్టు 40 నెలల శిక్ష విధించింది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించడానికి రష్యాతో కలిసి కుట్ర పన్నారని స్టోన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో దర్యాప్తును స్టోన్ అడ్డుకున్నట్టు రుజువైనందున కోర్టు తాజా తీర్పును వెలువరించింది. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికి స్టోన్ రష్యాతో కలిసి కుట్రపన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు డెమోక్రాటిక్ పార్టీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో స్టోన్ సాక్ష్యులను బెదిరించడం, యూఎస్ కాంగ్రెస్‌కు అస్యతాలు చెప్పడమే కాకుండా హౌస్ దర్యాప్తును అడ్డుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై విచారించి కోర్టు నవంబరులో స్టోన్‌ను దోషిగా తేల్చింది. ఈ కేసు విషయంలో రాజకీయ ఒత్తిడిని పెంచేందుకు స్టోన్ చేసిన చర్యలతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అమీ బెర్మాన్ జాక్సన్ అభిప్రాయపడ్డారు.













