అబ్రహాం లింకన్ తర్వాత నేనే
నల్లజాతి అమెరికన్లకు తానే ఉత్తమ దేశాధ్యక్షుడినని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో జరిగిన రెండవ డిబేట్లో ట్రంప్ ఈ కామెంట్ చేశారు. బానిసత్వాన్ని రూపుమాపిన మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తర్వాతే.. నల్లజాతీయుల్ని ఆదుకున్నది తానే అని ట్రంప్ అన్నారు. బైడెన్ ఎన్నో దశాబ్దాల నుంచి రాజకీయంలో ఉన్నారని, కానీ ఆయన నల్లజాతి అమెరికన్ల కోసం ఏమీ చేయలేదని ట్రంప్ ఆరోపించారు. నల్లజాతీయులకు చెందిన కాలేజీలు, యూనివర్సిటీలను తానే రక్షించినట్లు ట్రంప్ అన్నారు. అయితే ఆ సమయంలో బైడెన్ ఓ సెటైర్ కామెంట్ చేశారు. అమెరికా ఆధునిక చరిత్రలో అత్యంత జాత్యహంకారం కలిగిన అబ్రహం లింకన్ ఈయనే అంటూ ట్రంప్‌పై బైడెన్ సెటైర్ వేశారు.
నల్లజాతీయులు అమెరికాలో చేపడుతున్న నిరసనల గురించి ట్రంప్ మాట్లాడుతూ జాత్యాంహకారం లేని వ్యక్తుల్లో తాను ముందుంటానన్నారు. 1994లో నేర బిల్లును బైడెన్ తీసుకువచ్చారని, దాని పట్ల బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసన వ్యక్తం చేసినట్లు ట్రంప్ గుర్తు చేశారు. ఆధునిక చరిత్రలో ట్రంప్ మోస్ట్ రేసిస్ట్ అధ్యక్షుడిగా నిలుస్తారని బైడెన్ కామెంట్ చేశారు. ప్రతి జాత్యాంహకార ఘటనలకు ట్రంప్ ఆజ్యం పోస్తున్నారని బైడెన్ ఆరోపించారు.













