బే ఏరియాలో ‘పాఠశాల’ వసంతోత్సవం
ముఖ్య అతిధిగా గంటా శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ, పాఠశాల ఆధ్వర్యంలో జూన్ 3వ తేదీన బే ఏరియాలో వసంతోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఎన్నారైల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన సిలబస్‌తో విద్యార్థులకు తెలుగు భాషను నేర్పిస్తున్న పాఠశాల బే ఏరియాలో అనేక ప్రాంతాల్లో కేంద్రాలను నెలకొల్పి విజయవంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన నాలుగు సంవత్సరాల ‘తెలుగు పలుకు’ కోర్స్‌ను పాఠశాల మాత్రమే బోధిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు ఇటీవలనే పరీక్షలను నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈ వసంతోత్సవంలో పతకాలను బహుకరించనున్నారు.
బే ఏరియా తెలుగు అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పాఠశాల వసంతోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా, స్కూల్ ఎడ్యుకేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఐఎఎస్ గౌరవ అతిధిగా పాల్గొంటున్నారు. వీరితోపాటు అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, పాఠశాల చైర్మన్ జయరాం కోమటి కూడా ఈ వేడుకలకు హాజరవుతున్నారు. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు అందరూ రావాలని పాఠశాల నిర్వాహకులు కోరారు.
తెలుగు కోర్స్‌ను పూర్తి చేసిన విద్యార్థులకు మే 19-20 తేదీల్లో పరీక్షలను నిర్వహించామని, ఆ పేపర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ కరెక్షన్ చేసిన తరువాత మార్కులు, ఫలితాలు వస్తాయని, వసంతోత్సవం రోజున విద్యాశాఖ మంత్రిగారి చేతుల మీదుగా వారు సర్టిఫికెట్లు తీసుకుంటారని చెప్పారు. దాదాపు 40 మంది విద్యార్థులు 4 సంవత్సరాల తెలుగు కోర్స్‌ను పూర్తి చేశారని పాఠశాల సిఇఓ సుబ్బారావు చెన్నూరి వివరించారు.













