అమెరికాలో చైనా తర్వాత మనమే
విద్యాభ్యాసం కోసం అగ్రరాజ్యం అమెరికా చేరుకుంటున్న భారతీయు సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఆ దేశ విశ్వవిద్యాలయాల్లో 2.1 లక్షల మందికిపైగా భారతీయులు చదువుకుంటున్నట్లు వెల్లడైంది. చైనీయుల తర్వాత మనదేశ విద్యార్థుల సంఖ్యే అక్కడ అధికమని తేలింది. అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్, ఎన్ఫోర్స్మెంట్స్ హోంలాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్కు చెందిన స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (సెవిస్)ఈ మేరకు వివరాలు వెల్లడించింది.
అమెరికాలో విశ్వవిద్యాలయాల్లో 3,77,070 మంది చైనా విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ విద్యార్థుల సంఖ్య 2,11,703. మొత్తంగా అమెరికాలో విదేశీ విద్యార్థుల్లో 49 శాతం మంది భారత్, చైనాలకు చెందిన వారే. ఈ రెండు దేశాల నుంచి అగ్రరాజ్యానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా సగటున 1-2 శాతం చొప్పున పెరుగుతోంది. సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, యెమెన్ల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఇటీవల తగ్గుముఖం పట్టింది. పాకిస్థాన్, మయన్మార్, కాంబోడియా విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమెరికాలో విదేశీ విద్యార్థుల్లో 77 శాతం మంది ఆసియావాసులే.













