మధురగాయకుడు ఆనంద్ కు ఘననివాళి

కరోనాతో మృతి చెందిన మధుర గాయకుడు జి ఆనంద్‍కు ఏడు దేశాల నుంచి పలువురు ప్రముఖులు అంతర్జాలంలో నివాళులర్పించారు. ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత రంగంలో గాయకుడిగా కొనసాగి ‘స్వరమాధురి’ సంస్థను స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా 6,500కుపైగా కచేరీలు నిర్వహించారు. ఎంతో మంది గాయనీ, గాయకులను ఆయన తయారు చేశారని ఆనంద్ సేవలను గుర్తు చేసుకున్నారు.
ఆనంద్ కరోనా సమయంలో సరైన వైద్య సదుపాయం అందక మరణించిన తీరును అందరూ ప్రస్తావిస్తూ కళాకారుల జాతి సంపదని వారిని కాపాడుకోవలసిన అవసరం ప్రతి దేశానికి వున్నదని అన్నారు. కరోనా విపత్కర సమయంలో కళాకారులను ప్రత్యేకంగా ఆదుకునే విధానం ప్రభుత్వాలు పరిశీలించాలని ఆనంద్‍కు నివాళులర్పిస్తూ అన్నారు.
ఈ అంతర్జాల కార్యక్రమాన్ని వంశీ గ్లోబల్ అవార్డస్ ఇండియా, సంతోషం ఫిలిం న్యూస్ ఇండియా, శారద ఆకునూరి అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించారు. న్యూజెర్సీ నుంచి దాము గేదెల మాట్లాడుతూ, అంతర్జాతీయంగా ఆనంద్ పేర ఒక సంగీత పురస్కారాన్ని నెలకొల్పుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ మాగంటి, ఆనంద్ తన ఎన్నో చిత్రాల పాటలకు గాత్రం ఇచ్చారని వారి సుమధుర గీతాలు తన పాత్రలకు న్యాయం చేశాయని అన్నారు. ఈ అంతర్జాల నివాళి సభలో మండలి బుద్ద ప్రసాద్ , ఘంటసాల రత్నకుమార్, భువన చంద్ర, మాధవ పెద్ది సురేష్, ఆర్పీ పట్నాయక్, సురేష్ కొండేటి, సారిపల్లి కొండలరావు , డా నగేష్ చెన్నుపాటి, ఉపేంద్ర చివుకుల, ప్రసాద్ తోటకూర, డా ఆళ్ల శ్రీనివాస్, శారద సింగిరెడ్డి, రవి కొండబోలు, శ్రీదేవి జాగర్లమూడి, శ్రీనివాస్ చిమట, రమణ జువ్వాది, రత్న కుమార్ కవుటూరు, తాతాజీ ఉసిరికల, అనిల్, హరి వేణుగోపాల్, రామాచారి, మల్లికార్జున్, రాము, ప్రవీణ్ కుమార్ కొప్పుల, వేణు శ్రీరంగం, సురేఖ మూర్తి దివాకర్ల, జీవీ ప్రభాకర్, విజయలక్ష్మి చంద్రతేజ, మొహమ్మద్ రఫీ తదితరులు ఆనంద్ గారితో తమ అనుబంధాన్ని పంచుకొని శ్రద్ధాంజలి ఘటించారు.