విద్యార్థినికి పారితోషికం అందించిన ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి
కర్నూలు నగరానికి చెందిన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తెలుగు సాయి సోమితకు తానా మాజీ కార్యదర్శి, ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి సహకారంతో ఇరవై వేల రూపాయల పారితోషికం అందించారు. కరోనా వైరస్ తీవ్రతతో ప్రతిభావంతులైన విద్యార్థులు కుటుంబసభ్యులని కోల్పోయి పలు ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న చేయూత కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్ చదువుతున్న సాయి సోమితకు పారితోషికం అందించినట్లు పొట్లూరి రవి తెలిపారు. ప్రతిభ గల విద్యార్ధినీ, విద్యార్దుల లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టటం జరిగిందని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి తెలిపారు.
పారిశ్రామికవేత్త ముప్పా రాజశేఖర్, సుధాకర్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













