ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ వ్యవస్థాపకుడు అక్కినేని మృతి
ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అక్కినేని సుదర్శనరావు (74) బుధవారం రాత్రి విజయవాడలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుతో మరణించారు. నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచారని ఎన్నారై ప్రతినిధులు తెలిపారు. అమెరికాలో స్థిరపడిన కృష్ణ, గుంటూరు జిల్లాల ప్రవాసాంధ్ర వైద్యులు 30 మంది కలిసి ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ను 2003 సంవత్సరంలో ప్రారంభించారు. 2011 వరకు దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా సుదర్శనరావు వ్యవహరించారు. ఆయన సతీమణి డాక్టర్ మణి ప్రస్తుతం సంస్థ కోశాధికారిగా ఉన్నారు. సుదర్శనరావు అనస్తీషియా వైద్యుడిగా, భార్య మణి స్త్రీల వైద్య నిపుణురాలిగా అమెరికాలో షికాగాలో పనిచేశారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం, బొడ్డుపాడులో జన్మించిన సుదర్శనరావు కర్నూలు మెడికల్ కళాశాలలో 1970లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గుంటూరు వైద్యశాలలో జనరల్ సర్జరీ విభాగంలో పనిచేశారు. తర్వాత అమెరికాలోని షికాగోలో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ఆసుపత్రిలో అనస్తీషియా విభాగంలో పీజీ చేశారు. అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డారు. తానా అధ్యక్షుడిగా, ట్రైస్టేట్ తెలుగు అసోసియేషన్ వ్వవస్థాపక సభ్యుడిగా, నాటా ఉపాధ్యక్షుడిగా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో అధ్యక్షుడిగా పనిచేశారు.













