పేద అర్చకుల ఆకలి తీర్చుతున్న నాట్స్
ఒంగోలులో నాట్స్ అధ్యక్షుడి దాతృత్వం
అమెరికాతో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన దాతృత్వం చాటుకుంటూనే ఉంది. ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టడమే ఈ సమయంలో మహాత్కార్యమని భావించిన నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ఒంగోలులో పేద అర్చకులకు తన వంతు సాయం అందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేట సాయిబాబా ఆలయంలో వందమంది పేద అర్చకులకు ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. ఒక్కోక్కరికి పది కేజీల బియ్యం, రెండు కేజీల కందిపప్పు, 11 రకాల కూరగాయలను ఉచితంగా అందించారు.
నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి తరపున స్థానిక పురోహితులు దక్షిణామూర్తి ఈ సాయాన్ని పేద అర్చకులకు అందించారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేద పురోహితులకు ఈ సాయం ఎంతో ఊరటనిస్తుందని దక్షిణామూర్తి అన్నారు. పేద పురోహితులను ఆదుకోవడానికి ప్రస్తుతం ఎవరు ముందుకు రావడంలేదని.. ఈ విషయం అమెరికాలో ఉన్న నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్‌కు చెప్పినప్పుడు ఆయన సత్వరమే స్పందించి తాను సాయం చేస్తానని చెప్పటంతో పాటు వెంటనే కావాల్సిన ఆర్ధిక సాయం చేశారాన్నారు. ఆకలిబాధల్లో ఉన్న తమకు ఈ కష్టకాలంలో నాట్స్ చేసిన సాయాన్ని తామెప్పుడూ మరిచిపోలేమని పేద అర్చకులు తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూనే ఈ సాయం పంపిణి జరిగింది.













