చైనా పారదర్శకంగా వ్యవహరించలేదు : పాంపియో
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కొవిడ్ 19కు పుట్టిల్లయిన చైనాపై అమెరికా మరోసారి మండిపడింది. వైరస్ వ్యాప్తి వెలుగుచూసిన తొలినాళ్లలోనే ఆ దేశంలోకి తమ వైద్య నిపుణులను అనుమతించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. వుహాన్‌లో రహస్య ప్రయోగశాల ఉందనీ, ఆ నగరంలోనే వైరస్ ఉద్భవించిన సంగతి తమకు తెలుసుననీ వ్యాఖ్యానించింది. కరోనా విజృంభిస్తున్న తొలి దశల్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంతర్జాతీయ ఆత్యయిక స్థితిని విధించకపోవడానికి చైనాయే కారణమని విమర్శించింది.
వుహాన్‌లో ప్రయోగశాల ఉందని మాకు తెలుసు. అక్కడి జంతుమాంస విక్రయ మార్కెట్ (వెట్ మార్కెట్) గురించీ అవగాహన ఉంది. వుహాన్‌లోనే కరోనా పుట్టిందనీ తెలుసు. వీటన్నింటి గురించి సునిశితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పేర్కొన్నారు. వుహాన్ లోని ఓ రహస్య ప్రయోగశాలను ఉద్దేశించే ఆయన తాజా వ్యాఖ్యలు చేసినట్లు సృష్టమవుతోంది. అందులో కరోనా వైరస్‌కు సంబంధించి ప్రమాదకర అధ్యయనాలు జరుగుతున్నట్లు అమెరికా దీర్ఘకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోందని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. కరోనా విషయంలో పారదర్శకంగా వ్యవహరించలేదంటూ పాంపియో గుప్పించిన విమర్శలను చైనా తోసిపుచ్చింది.













