ఈ మహోత్సవానికి ముగింపు లేదు…అందరితో కలిసి తెలుగు వైభవాన్ని కొనసాగిస్తాం…
– తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ వేదికగా నిర్వహించిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం జూలై 24 నుండి వారం రోజుల పాటు ఘనంగా జరిగి ఆగస్టు 2వ తేదీన ముగిశాయి. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ, మహోన్నతంగా జరిగిన ఈ మహోత్సవానికి ముగింపు లేదు. మరో సాంస్కృతిక ఉద్యమానికి ఈ మహోత్సవం నాంది పలికింది. మహా భాషా ఉత్సవాలకు ప్రారంభం ఇది అన్నారు. తెలుగు భాషా సంస్కృతి వైభవం ఉట్టిపడే విధంగా ‘సౌందర్యలహరి, తెలుగు వెలుగు, రాగ మంజరి, నాదామృతం, అందెల రవళి, కళాకృతి, రంగస్థలం, భువనవిజయం వంటి ఎనిమిది విభాగాలలో 32 అంశాలలో నిర్వహించిన పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 18,300 మంది తెలుగు వారు పాల్గొనడమే ఈ మహోత్సవం ఎంత అద్భుతంగా జరిగాయో అన్నదానికి నిదర్శనం అన్నారు.
ఈ ఉత్సవం నింపిన స్ఫూర్తి… విశ్వ తెలుగు వికాసానికి, ప్రకాశానికి మరో ఆరంభంగా భావిస్తున్నామన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కలిసి ఆలపించబోతున్న తెలుగు సమైక్య బృందగానాలకు ఈ ఉత్సవం నాంది పలికిందన్నారు. ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు ఉంటూ.. తెలుగు జాతి మొత్తాన్ని ఏకం చేసే మహా వేదిక నిర్మాణానికి ఆరంభం ఈ ఉత్సవం. వేలాది లక్షలాది మంది తెలుగు వారిని ఒకే వేదిక మీదకు తీసుకొని వచ్చి తెలుగు వారి గుండె చప్పుడును ప్రపంచం మొత్తం ప్రతిధ్వనింపజేసిన ఈ మహోత్సవం ముగియలేదన్నారు.
పోటీల్లో మన తెలుగు వారు ప్రదర్శించిన ప్రతిభ పాటవాలను చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆనందం కలిగింది. అసాధారణమైన మన వారి కళలు, నైపుణ్యాలు చూసి ఆశ్చర్యపోనివారుండరు. భువనవిజయం నిర్వహించిన చర్చాగోష్టి లో పాల్గొన్న పెద్దలు తెలుగు ను ఎలా అభివృద్ది చేయాలి అనే విషయంపై అమూల్యమైన సూచనలు చేసారు. వీటన్నిటినీ ప్రభుత్వాలకు పంపిస్తాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 85 యేళ్ల పెద్దాయన 8 గంటలు తనవంతు వచ్చే వరకు ఓపికగా ఉండి పాల్గొని తన భాషాభిమానాన్ని చాటారు. ఒక అంధుడు మనసుకు హత్తుకునేలా వాద్య పరికరంపై పాటలు పాడి ఆశ్చర్యపరిచారు. బ్యూటీ పోటీల్లో పాల్గొన్నవారిలో విజేతలుగా నిలిచినవారి వివరాలను చూస్తే ఒకరు అమలాపురం, మరొకరు న్యూజీలాండ్, ఇంకొకరు న్యూయార్క్…ఇన్ని చోట్లనుంచి ఇంత మందిని ఒకే వేదికపై కలపగలిగినందుకు సంతోషం కలిగింది. భవిష్యత్తులో కూడా అందరితో కలిసి పనిచేయడానికి తానా సిద్ధంగా ఉందని జయ్ తాళ్ళూరి పేర్కొన్నారు.













