గ్రీన్‌కార్డు నిబంధనలు సరళతరం చేస్తాం : రాజా కృష్ణమూర్తి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అయిన మరుక్షణం నుంచి వలసదారులపై కక్షగట్టిన సంగతి తెలిసిందే. వీసా నిబంధనల్ని క్రమంగా కఠినతరం చేస్తూ వచ్చారు. భారత్, చైనా, మెక్సికో తదితర దేశాల నుంచి వృత్తి నిపుణుల రాకను వీలైనంతగా తగ్గించాలని ఆయన వ్యూహం పన్నారు. దాంతో ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, గగనంగా మారింది. హెచ్ 1బీ వీసాలపైన ట్రంప్ సర్కార్ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది. హెచ్ 1బీ వీసాదారు భాగస్వామి సైతం ఉద్యోగం పొందకుండా ట్రంప్ సర్కార్ నిబంధనలు కఠినతరం చేసింది.
గ్రీన్‌కార్డు ఎప్పుడొస్తుందా అని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భారతీయ వృత్తి నిపుణులు ట్రంప్ సర్కార్ నిర్ణయాలతో డీలా పడ్డారు. గ్రీన్‌కార్డు వచ్చేట్టు లేదు. ఇండియాకు వెళ్లిపోవాల్సిందే అనే పరిస్థితి ట్రంప్ కల్పించారు. వర్క్ వీసా, గ్రీన్‌కార్డు నిబంధనలు కఠినతరం చేయటమే కాదు, చట్టపరంగా వాటికి ఆమోదముద్ర వేయించారు. దాంతో అమెరికా అంతటా వలసదారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటివారందరికీ ఇప్పుడున్న ఒకే ఒక ఆశాకిరణం డెమొక్రాట్లు మళ్లీ అధికారంలోకి రావటం, జో బైడెన్ అధ్యక్షుడవటం.
త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడంతో ట్రంప్ ఓడిపోయి, జో బైడెన్ వస్తే వీసా నిబంధనలు మారుతాయని మనవాళ్లంతా ఆశపడుతున్నారు. డెమొక్రాట్ నాయకుడు, ఇల్లినాయిస్ నుంచి కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న రాజా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు సైతం అమెరికాలోని భారతీయుల్లో ఆశలు రేపాయి. జో బైడెన్ అధ్యక్షుడవుతే.. గ్రీన్‌కార్డుపై పొందటం సులభమవుతుందని, ఇతర నిబంధనలు మారుతాయని కృష్ణమూర్తి వెల్లడించారు.













