అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు
అమెరికా సుంకాల వడ్డనకు ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. అమెరికా, స్టీల్, అల్యూమినియంపై దిగుమతి సుంకాలను ఉపసంహరించుకోని పక్షంలో దీటుగా జవాబు ఇవ్వాలనుకుంటోంది. వచ్చే నెల నుంచి యుఎస్ నుంచి దిగుమతయ్యే బాదంపప్పు, యాపిల్స్, ప్రత్యేక మోటర్సైకిళ్లతో సహా 20 రకాల ఉత్పత్తులపై సుంకాన్ని గరిష్టంగా రెట్టింపు స్థాయికి పెంచనున్నట్లు భారత్ సర్కారు ప్రపంచ వాణిజ్య సంస్థకు (డబ్ల్యుటిఒ) తెలిపింది.
డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఇటీవల ఉక్కు దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం సుంకం విధించింది. అయితే ఈ ఆంక్షల నుంచి కెనడా, మెక్సికోకు మినహాయింపునిచ్చింది. తమకు సైతం మినహాయింపు ఇవ్వాలని భారత్ ఇప్పటికే అమెరికాను కోరింది. ఈ విషయంపై డబ్ల్యుటిఒకు ఫిర్యాదు కూడా చేసింది. భారత్ ఏటా 150 కోట్ల డాలర్ల విలువైన ఐరన్, అల్యూమినియంను అమెరికా దిగుమతి చేస్తోంది. వివక్షాపూరితమైన ఈ చర్యలతో అమెరికాకు తమ ఎగుమతులు దెబ్బతింటాయని భారత్ డబ్ల్యూటిఓ వివాద పరిష్కార యంత్రాంగాన్ని భారత్ ఫిర్యాదు చేసింది.













