అమెరికాను ముంచెత్తిన మైకేల్
హరికేన్ మైకేల్ ఫ్లోరిడాలో భారీ విషాదం మిగిల్చింది. యుద్ధంలో ప్రయోగించిన బాంబులా ఒక్కసారిగా మీద పడి వాయవ్య, తీర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. ఇళ్లను, చెట్లను, విద్యుత్తు స్తంభాలను నేలమట్టం చేసింది. వేలాది మందికి నిలువ నీడ లేకుండా రోడ్డున పడేసింది. అమెరికాను గజగజలాడించిన నాలుగు భారీ తుపాన్లలో మైకేల్ ఒకటిగా నిలిచింది. అత్యవసర స్పందనా దళాలు శిథిలాల్లో చిక్కుకొన్న వారి కోసం ముమ్మరంగా గాలింపులు చేపట్టాయి. విద్యుత్ సరఫరాను, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నాయి. దీని ధాటికి మెక్సికో తీరం ధ్వంసమైపోయింది. ఇక్కడ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో, చాలా నివాసాలు కుప్ప కూలాయి. నౌకాశ్రయంలోని పడవలు, ఓడలు తలకిందులయ్యాయి.













