రిచ్మండ్లో ఆకట్టుకున్న సంక్రాంతి సంబరాలు
రిచ్మండ్లో సంక్రాంతి వేడుకలను వైభవంగా జరిపారు. గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ (జీఆర్టీఏ) ఆధ్వర్యంలో రిచ్మండ్ డీప్ రన్ హై స్కూల్లో జనవరి 19న జరిగిన సంక్రాంతి వేడుకల్లో దాదాపు 1400 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో 40 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. పిల్లలకు భోగిపళ్లు పోశారు. గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి. ఈ వేడుకల్లో మహిళలు చేసిన డాన్స్లు కార్యక్రమానికే హైలెట్గా నిలిచాయి. వేడుకల్లో పాల్గొన్న ప్రజలకు తిరుపతి ప్రసాదం అందించారు. సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ జీఆర్టీఏ ట్రోఫీలను బహూకరించారు. ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి రవి రియాలిటి రవి గుత్తా బహుమతులు అందజేశారు.
ఈ వేడుకలకు దక్షిణ భారత సంఘాల అధ్యక్షులు కన్నన్ మయ్యప్పన్ (రిచ్మండ్ తమిళ సంఘం), నబీల్ మట్టారా (గ్రామమ్ మలయాళీ అసోసియేషన్), రిచ్మండ్ కన్నడ సంఘానికి చెందిన సూరజ్, సతీష్ మిశ్రా, రాజ్బన్స్ జోషీ, రాకేష్ బైన్స్లా (ఐఏవీఏ), సుబ్బ రాజు (మనబడి) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకల్లో పాల్గొని, కార్యక్రమాలను విజయవంతం చేసిన వారికి జీఆర్టీఏ అధ్యక్షుడు శంకర్ మాకినేని ధన్యవాదాలు తెలిపారు.













