వైభవంగా ముగిసిన తానా బాలోత్సవం -2020
పిల్లల కళలను ప్రోత్సహించేలా సాగిన ఉత్సవం
వివిధ అంశాలలో పోటీలు…విజేతలు…
అమెరికాలోని చిన్నారుల ప్రతిభను వెలికితీసే విధంగా వివిధ నగరాల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో తానా బాలోత్సవం-2020 పేరుతో వివిధ పోటీలను నిర్వహించారు. తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి భద్రాచలంలో నిర్వహించిన బాలోత్సవ్ తరహాలోనే అమెరికాలో కూడా బాలోత్సవంను ఘనంగా నిర్వహించారు. కోవిడ్ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బాలోత్సవంను ఆన్లైన్ వేదికగా నిర్వహించారు. వివిధ విభాగాల్లో పోటీలను నిర్వహించారు. పోటీలను రెండు కేటగిరీలుగా విభజించారు. 11 నుంచి 16 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి, 5-10 సంవత్సరాల వయస్సుకలిగిన వారికి ప్రత్యేకంగా పోటీలను నిర్వహించారు. క్లాసికల్ సింగింగ్, క్లాసికల్ సింగింగ్ కిడ్స్, ప్యాటియాటిక్ ఫ్యాన్సీ డ్రెస్, ప్యాటియాటిక్ ఫ్యాన్సీ డ్రెస్ కిడ్స్ కేటగిరి, తెలుగు పద్యాలు జూనియర్స్, తెలుగు పద్యాలు కిడ్స్, ఫిల్మీ డ్యాన్స్ జూనియర్స్, ఫిల్మి డ్యాన్స్ కిడ్స్, క్లాసికల్ డ్యాన్స్ జూనియర్స్, క్లాసికల్ డ్యాన్స్ కిడ్స్, ఫిల్మీ సింగింగ్ జూనియర్స్, ఫిల్మీ సింగింగ్ కిడ్స్, చెస్ జూనియర్స్, చెస్ కిడ్స్, పబ్లిక్ స్పీకింగ్ జూనియర్స్, పబ్లిక్ స్పీకింగ్ కిడ్స్, రోబోటిక్స్ జూనియర్స్, రోబోటిక్స్ కిడ్స్, ఆర్ట్ జూనియర్స్, ఆర్ట్ కిడ్స్ విభాగంలో పోటీలను నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. దాదాపు 60 రోజుల నిర్విరామ, ఉత్సాహభరితంగా నిర్వహించిన తానా బాలోత్సవం ముగింపు వేడుకలను నవంబరు 14 న దీపావళి మరియు బాలల దినోత్సవంనాడు ఘనంగా జరిపారు.
ముగింపు ఉత్సవాల్లో తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ, బాలల ప్రతిభనువెలికి తీసేందుకే బాలోత్సవం కార్యక్రమాన్ని అమెరికా అంతటా నిర్వహించినట్లు చెప్పారు. ఆన్లైన్ ద్వారా జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న చిన్నారులు ప్రదర్శించిన ప్రతిభ అపురూపమని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ‘వకారపంచకం’ విశిష్టత, అది విద్యార్ధుల భవిష్యత్తుకు ఎలా దోహదకారి అవుతుందో వివరించారు.
బాలోత్సవం కార్యక్రమ రూపకర్త డాక్టర్ రమేష్‌బాబు వాసిరెడ్డి తన అనుభవాలను పంచుకున్నారు. తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన, డాక్టర్ జంపాల చౌదరి, తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ అంజయ్య చౌదరి కూడా మాట్లాడారు. వేడుకల్లో పాల్గొన్నవారిని అభినందించారు.
కరోనా వంటి విపత్కర పరిస్థితులలోగూడ ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తానా బాలోత్సవ కమిటీ, రేఖా ఉప్పలూరి, సునీల్ పాంత్రా, రాజా కసుకుర్తి, సుమంత్ రామిశెట్టి, శ్రీని యలవర్తిని తానా అధ్యక్షులు జే తాళ్ళూరి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి సినీ, సాంస్క•తిక, క్రీడా ప్రముఖులు కొరటాల శివ, నాగ్ అశ్విన్,రామజోగయ్య శాస్త్రి, పద్మశ్రీ శోభారాజు, కూచిపూడి ప్రముఖులు సత్యనారాయణ, ప్రముఖ నటి మరియు కూచిపూడి కళాకారిణి జ్యోతి రెడ్ది ,హిమాన్సీ కాట్రగడ్డ, గాయకుడు శ్రీ క్రిష్ణ, చదరంగపు గ్రాండ్ మాస్టర్ పెండ్యాల హరిక్రిష్ణ తదితరులు పాల్గొని తమ సందేశాలను చిన్నారులకు అందజేశారు.
ఈ తానా బాలోత్సవం లో ఉత్తర అమెరికా మొత్తం నుంచి 2400 మంది చిన్నారులు, శాస్త్రీయ సంగీతం, తెలుగు పద్యాలు, సినీ నృత్యాలు, సినీ గీతాలు, దేశభక్తి రూపాలు, చిత్రలేఖనం,చదరంగం వంటి మొదలగు 11 రకాల విభాగాలలో, రెండు వయస్సు గ్రూపులలో పాల్గొన్నారని, న్యాయనిర్ణేతలు అందులో 66 మంది విజేతలను గుర్తించి ప్రకటించినట్లు తానా నాయకులు తెలిపారు.
వివిధ కేటగిరీల్లో విజేతలుగా నిలిచినవారి వివరాలు…
క్లాసికల్ సింగింగ్ జూనియర్స్ విభాగంలో హైందవి వెల్దండ(కాలిఫోర్నియా), క్లాసికల్ సింగింగ్ కిడ్స్ విభాగంలో సాయి శరణ్య దండు (న్యూజెర్సి), దేశభక్తిని చాటే డ్రస్సుల పోటీల్లో జూనియర్స్ విభాగంలో హంసిని తిరుమలశెట్టి (కాలిఫోర్నియా), కిడ్స్ విభాగంలో జస్మిత దశమినేని (న్యూజెర్సి), తెలుగు పద్యాలు జూనియర్స్ విభాగంలో రిషిక గోటేటి (న్యూజెర్సి), కిడ్స్ విభాగంలో శ్రేష్ట విష్ణుభొట్ల (వర్జీనియా), ఫిల్మీ డ్యాన్స్ జూనియర్స్ విభాగంలో దీక్ష గడ్డం (సిఓ), కిడ్స్ విభాగంలో నైనిక తక్కళ్ళపల్లి (ఎన్‌సి), క్లాసికల్ డ్యాన్స్ జూనియర్ విభాగంలో హరిక దోనేపూడి (సిఓ), కిడ్స్ విభాగంలో సహస్ర వింజమూరి(వర్జీనియా), ఫిల్మీ సింగింగ్ జూనియర్స్ విభాగంలో వైభవ్ గరిమెళ్ళ (ఎన్‌సి), కిడ్స్ విభాగంలో పర్ణిక వుల్లగంటి (టెక్సాస్), చెస్ జూనియర్స్ విభాగంలో రుత్వికరావు లంకిపల్లె (జిఎ), కిడ్స్ విభాగంలో శ్రీరామ్ వనపర్తి (ఒహాయో), పబ్లిక్ స్పీకింగ్ జూనియర్స్ విభాగంలో ఆయుష్ మైనేని (న్యూజెర్సి), కిడ్స్ విభాగంలో జెస్సికా రెడ్డి (సిఎ), రోబోటిక్స్ జూనియర్స్ విభాగంలో కుమార్ పులివర్తి (కెనడా), కిడ్స్ విభాగంలో ధ్రువ్ మల్లు (సిఎ) ఆర్ట్ జూనియర్స్ విభాగంలో కమలిక గోగినేని (ఎంఐ), కిడ్స్ విభాగంలో శ్రీహిత్ మాజేటి (న్యూజెర్సి)
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అందరినీ, బాలోత్సవ కమిటిని తానా నాయకులు అభినందించారు, తానా కోశాధికారి సతీష్ వేమూరి పోటీల్లో పాల్గొన్నవారికి, అతిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.













