అద్భుతంగా జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఉగాది సాహిత్య సదస్సు

అమెరికా తెలుగులు సంఘం (ఆటా) శనివారం ఏప్రిల్ 17, 2021 ‘ఆటా ఉగాది సాహిత్య సదస్సు’ కార్యక్రమం అధ్యక్షులు భువనేశ్ బూజాల, ఆటా కార్యవర్గ బృందం ఆధ్వర్యంలో అతి ఘనంగా జూమ్ లో నిర్వహించారు. సాహిత్య వేదిక కమిటి అధిపతి శారద సింగిరెడ్డి మరియు సహ బృందం కార్యక్రమ నిర్వహణ విజయవంతగా జరిపారు.
ముందుగా శారద సింగిరెడ్డి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ సభకి స్వాగతం పలికారు. సాహిత్యం కేవలం మనస్సుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా ఒక వ్యక్తి వ్యక్తిత్వంలో వికాసానికి కూడా తోడ్పడుతుంది అని తన భావాన్ని వ్యక్తం చేసారు. ఆటా సాంస్కృతిక విభాగం ఉపాధిపతి యామిని స్ఫూర్తి మేడూరు ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. కృష్ణవేణి మల్లవజ్జల సాహిత్య సదస్సు కి వ్యాఖ్యాత గా వ్యవహరించారు. అధ్యక్షులు భువనేశ్ బూజాల తెలుగు వారందరికి ఆటా సంస్థ తరపున ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసారు. ఆటా సంస్థ మన సంస్కృతిని గౌరవిస్తూ, మన సాంప్రదాయాన్ని ప్రేమిస్తూ, మన విలువలని కాపాడుకుంటూ, మన పండగలను బంధు మిత్రులతో జరుపుకుంటూ వీటన్నిటిని ముఖ్యంగా మన బావి తరాలకు అందిస్తూ ముందుకు వెళుతుంది అని, ఆటా ఎప్పటికి మన భాషకి , మన సాహిత్యానికి పెద్ద పీట వేస్తుంది అని తెలియ చేసారు.
శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు డా. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ‘పంచాంగ శ్రవణం’ వినిపించారు. పంచాంగ శ్రవణంలో భాగంగా ప్లవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాన్ని అలాగే అన్ని రాశుల ఆదాయ వ్యయాలను, గ్రహగతులను, అలాగే వ్యక్తిగత అనుకూలతల కొరకు సలహాలు సూచనలను వారు వివరించడం జరిగింది. మహా సహస్రావధాని, ప్రవచన కిరీటి డా. గరికిపాటి నరసింహారావు ‘ఆశావాది – ఉగాది’ అనే అంశం పైన అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారు. మనిషి నిత్య జీవితంలో దురాశకు అలాగే నిరాశకు రెండింటికీ లోనుకాకూడదని, ఆశావాదిగా ఉండాలి అని, కేవలం నేటి గురించి మాత్రమే ఆలోచించాలి అని అప్పుడే ప్రశాంతమైన జీవితం సాధ్యమౌతుంది అని, ఉగాది పచ్చడి లాగానే జీవితంలో కష్టసుఖాలు అన్ని సమపాళ్లలో ఉన్నప్పుడే జీవితం విలువ తెలుస్తుంది అని వివరించారు.
ప్రముఖ సినీగేయ రచయిత వనమాలి మారుతున్న కాలంలో సినీ గేయ రచయితల పరిస్థితులు, తెలుగు భాషకు తగ్గుతున్న ప్రాధాన్యత మొదలైన అంశాలతో కూడిన చక్కటి కవితను వినిపించారు. హాస్య అవధాని డా. శంకర్ నారాయణ ‘ఖతర్నాక్ మన్మధ కాస్త జాగ్రత్త’ అంటూ తనదైన హాస్యపు జల్లులతో కవితలను చదివి వినిపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ప్రముఖ రచయిత కవి డా. అఫ్సర్ కరోనా టైంలో ఏర్పడుతున్న పరిస్థితుల గురించి వివరిస్తూనే మరోవైపు ప్లవ సంవత్సరంలో ‘భావి ఆశలుగా భ్రాతగా ఉండాలి’ అనే చక్కటి కవితను చదివి వినిపించారు. ప్రముఖ కథారచయిత పాత్రికేయులు ముని సురేష్ పిళ్ళై ‘ఎందుకు’ అనే కథా శీర్షికతో కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడిన దుస్థితినీ తెలియజేస్తూ ఈఉగాది నుండి అయిన బాగుండాలి అనే అద్భుతమైన అర్థంతో కూడిన కవితని వినిపించారు.
సాహిత్య వేదిక కమిటి ఉపాధిపతి పవన్ గిర్ల వేదిక లో పాల్గొన్న ముఖ్య అతిథులకు, వ్యాఖ్యాత కృష్ణవేణి మల్లావజ్జలకు కార్యక్రమం విజయవంతం కావటానికి కృషి చేసిన ఆట కార్యవర్గ బృంద సభ్యులకు అలాగే ప్రోగ్రాంకి ఎంతగానో సహకరించిన ఏబిఆర్ ప్రొడక్షన్స్ మరియు వారి సాంకేతిక నిపుణులందరికి, మీడియా మిత్రులు టీవీ5, మన టీవీ, యోయో, ఎన్ఆర్ఐ రేడియో అందరికీ హృదయ పూర్వక ధన్య వాదాలు తెలియచేసారు.











































































