విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న గోరంట్ల వాసుబాబు రూ. 90లక్షలతో 202 ప్రభుత్వ పాఠశాలల అధునీకరణ
ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు 202 ప్రభుత్వ పాఠశాలలను అమెరికాలో ఉన్న ఎన్నారై డాక్టర్ గోరంట్ల వాసుబాబు సొంత నిధులను ఖర్చు చేసి దాదాపు 90 లక్షల రూపాయలతో సైన్స్ ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులు, బోధనా సామాగ్రి తదితరులను ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా, పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామానికి చెందిన డాక్టర్ గోరంట్ల వాసుబాబు గత 4 సంవత్సరాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, నిజామాబాద్ జిల్లాలలోని పలు ప్రభుత్వ (జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు) పాఠశాలలో సైన్స్ ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులు, బోధనా సామాగ్రి తదితర సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికే 202 పాఠశాలల్లో ఈ విధమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
ప్రకాశం జిల్లా పర్చూరు మండలానికి చెందిన డాక్టర్ గోరంట్ల వాసుబాబు అమెరికాలో ఐటీ నిపుణునిగా స్థిరపడ్డారు. జన్మభూమిపై ప్రేమతో విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి విభాగం నాయకునిగా ఉన్న వాసుబాబు సొంత నిధులతోనే వందలాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సులువుగా అన్నీ అంశాలు అర్థమయ్యేందుకు వీలుగా సైన్స్ ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులు, బోధనా సామాగ్రి తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మీద మంచి అభిమానం ఉన్న గోరంట్ల వాసుబాబు తెలుగు టైమ్స్‌తో మాట్లాడుతూ, చదువులో చెవులతో విన్నదాని కన్న కళ్ళతో చూసినదాన్ని ఎక్కువగా గుర్తించుకోగలము, సులభంగా అవగాహన చేసుకోగలము. అందుకే పాఠశాలలస్థాయిలో దృశ్య శ్రవణ విద్యా విధానం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్టీఆర్ చెప్పేవారని, దానిని దృష్టిలో పెట్టుకునే పాఠశాలల్లో ఇలాంటి వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు గ్లోబు, ఆంధ్రప్రదేశ్ పటము, ఫిల్టర్ పేపర్ లాంటి చిన్న చిన్న వాటిని కూడా చూడలేదని, ఎందుకంటే ఆ రోజులలో సౌకర్యాలు అంతంత మాత్రమే అన్న విషయం అందరికి తెలిసినదేనని అంటూ, కానీ అలాంటి చిన్న చిన్న పరికరాలు విద్యార్థి దశలో మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. చిన్నతనంలో అందరం చందమామ, బొమ్మరిల్లు లాంటి బొమ్మల కథల పుస్తకాలు చదువుతాము. అందులో బొమ్మలు ఉంటాయి కాబట్టే మనకు ఆ పుస్తకాల పైన చదవాలనే మక్కువ ఉంటుంది. సైన్స్‌లో పరికరాలు, ప్రయోగాలు గురించి తరగతి గదిలో చెప్పటమే కాకుండా వాటిని చూపించి చెప్తే విద్యార్థులు ఎలాంటి కష్టమైన అంశాలపైనా సులభంగా అవగాహన చేసుకోగలుగుతారు. అందుకే ప్రతి ప్రాధమిక పాఠశాలలోను, ఉన్నత పాఠశాలలోను సైన్స్ ప్రయోగశాలలో ఉండవలసిన పరికరాలు, గణిత శాస్త్రంలో ఉండవలసిన వృత్తము, చతురస్త్రం, దీర్ఘచతురస్త్రం, కంకణం, స్తూపము, శంఖము, ఘనము, దీర్ఘ ఘనము లాంటి నమూనాలు, సాంఘిక శాస్త్రంలో ఉండవలసిన వివిధ మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు , దేశముల నైసర్గిక స్వరూపము, నదులు, పర్వతాలు, సముద్రాలు, సరస్సులు, దేశ సరిహద్దులు, వివిధ దేశాలలో ఉన్న భాషలు, వివిధ దేశాల జాతీయ పతకాలు, రాజధానులు, కరెన్సీ మొదలైన వాటిని సూచించే పటములు విద్యార్థులకి ఎంతో ఉపయోగపడతాయి.
అలాగే మన దేశ స్వాతత్య్రం కోసం పోరాడిన, ప్రాణాలు త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు, సమాజంలో ఉన్న ఎన్నో దురాచారాలను రూపుమాపిన సంఘ సంస్కర్తలు, ఎంతోమంది చరిత్రకారులు, కవులు, గాయకులు, దేశాధినేతలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎన్నో పరిశోధనలు చేసి ఆ ఫలితాలను మనకు అందచేసిన శాస్త్రవేత్తలు మొదలగు వారి చిత్రపటములు, వారి జీవిత చరిత్రలని తెలియజేపే చిత్రపటములు, చారిత్రాత్మక కట్టడాలు, మన పూర్వికుల జీవిన విధానాన్ని తెలియచేసే చిత్రపటములు కూడా పాఠశాలలో ఏర్పాటు చేయాలి. అందుకే ప్రతి పాఠశాలలకు బోధనా సామాగ్రిని అందజేసే ముందు ఆయా ప్రధానోపాధ్యాయులకు ఇలాంటి చిత్రపటములు తప్పనిసరిగా తీసుకుని పాఠశాలలో ఏర్పాటు చేయ్యమని చెప్పటం జరిగిందని ఆయన తెలిపారు.
ఎన్నారైలు కూడా తమ తమ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి వసతి సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థులు చదువులు బాగా రాణించగలరన్న విశ్వాసం తనకు ఉందని అంటూ, ఎన్నారైలంతా తమవంతుగా రాష్ట్ర ప్రగతికి, విద్యారంగం?అభివృద్ధికి కృషి చేయాలని గోరంట్ల వాసుబాబు కోరారు. తానా సైన్స్ ఫోరం?చైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.













