టైగర్ ఉడ్స్ కు అత్యున్నత పౌరపురస్కారం
ప్రముఖ గోల్ఫ్ ఆటగాడు టైగర్ ఉడ్స్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యున్నత అమెరికన్ పౌరపురస్కారాన్ని అందజేశారు. తన ఐదవ మాస్టర్స్ టైటిల్‌ను సాధించేందుకు గత నెలలో మళ్లీ అద్భుతంగా, ఆశ్చర్యకరంగా క్రీడారంగంలోకి దూసుకొచ్చిన టైగర్ ఉడ్స్.. ప్రపంచ క్రీడా చరిత్రలో నిజమైన లెజెండ్ అని ట్రంప్ ప్రశంసించారు. ఈ అవార్డును అందుకున్న వారిలో అతి పిన్న వయస్కుడైన గోల్ఫ్ క్రీడాకారుల్లో టైగర్ నాలుగో వ్యక్తి. అమెరికా ప్రతిభా పాటవానికి, అంకిత భావానికి, స్ఫూర్తికి ప్రపంచ చిహ్నం. ఆయన శ్రమ, సాధన.. ప్రజాదరణ పరంగా అథ్లెటిక్స్‌లో గోల్ఫ్‌ను ఉన్నత శిఖరాన నిలుపుతుంది. క్రీడా చరిత్రలో గొప్ప అథ్లెట్స్‌లో ఉడ్స్ ఒకరు అని అమెరికా అధ్యక్షుడు కొనియాడారు. 1997 నుంచి 2019 వరకు కొనసాగిన టైగర్ ఉడ్స్ క్రీడా ప్రస్థానాన్ని ట్రంప్ గుర్తు చేశారు. 2019 మాస్టర్స్ విన్ ఘట్టాన్ని గురించి చెబుతూ ఆ రోజు ఉడ్స్ టెలివిజన్ రికార్డుల్ని బద్దలు చేశారని చెప్పారు. చాలాకాలంగా ఉడ్స్ అభిమానిగా ఉన్న ట్రంప్ ఇటీవల వ్యాపార భాగస్వామిగా కూడా మారారు.













