బెర్నీ శాండర్స్, జో బైడెన్ల అధ్యక్ష పోరు
అమెరికాలో డెమొక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించేందుకు ఉద్దేశించిన సూపర్ ట్యూజ్‌డే పోరులో ఓటు వేసేందుకు లక్షలాది ఓటర్లు బారులు తీరారు. స్థానిక కాలమానం ప్రకారం మార్చి 3న 14 రాష్ట్రాల్లో ఈ ఓటింగ్ జరుగుతోంది. డెమొక్రాటిక్ అభ్యర్థిత్వం కోసం వెర్మాంట్ సెనెటర్ బెర్నీ శాండర్స్, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్లు ప్రధానంగా పోటీ పడుతున్నారు. అయితే ఈ పోరులో జో బైడెన్ కీలకమైన ముందంజ వేశారు. సెనేటర్ ఆమీ క్లోబూచార్, ఇండియానా మాజీ గవర్నర్ పీట్ బుట్టిగెగ్లు తాము అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా జో బైడెన్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు మరో ఎంపీ బెటో రూర్కీ కూడా బైడెన్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో మంగళవారం నాటి కీలకమైన ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ ప్రత్యర్థుల కంటే కొంత ఆధిక్యత సాధించినట్లయింది.
డెమొక్రటిక్ పార్టీలోని ఒక వర్గం నాయకులు బెర్నీ శాండర్స్‌కు వ్యతిరేకంగా మిగతా అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో బైడెన్ ముగ్గురి మద్దతు కూడగట్టడం విశేషం. అయినప్పటికీ ప్రస్తుతానికి బైడెన్‌కు యువ డెమొక్రాట్లలో మంచి పట్టునున్న బెర్నీ శాండర్స్, న్యూయార్క్ మేయర్ మైకెల్ బ్లూమ్బర్గ్లు ప్రత్యర్థులుగా మిగిలే ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో పోటీకి దిగిన బ్లూమ్‌బర్గ్ అధ్యక్ష పదవి అభ్యర్థి ఎన్నికల్లో తన సొంత డబ్బు లక్షల డాలర్లు ఖర్చు చేస్తూ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి గట్టి పోటీదారుగా ఎదిగారు. బైడెన్ ఇప్పటివరకు సౌత్ కరొలినా ప్రైమరీ మాత్రమే నెగ్గారు.













