ఎపి జన్మభూమి డిజిటల్ తరగతుల ఏర్పాటుకు డిట్రాయిట్ ఎన్నారైల విరాళం
డిట్రాయిట్లో ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్లోని 125 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. నోవై షెరటాన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో రాజధాని అవసరంతోపాటు భావితరాలకు భవిష్యత్తును నిర్దేశించే విద్యాశాఖాభివృద్ధికి కూడా కీలకమైందని, ఈ శాఖ అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
జయరాం కోమటి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎపి జన్మభూమి తరపున ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఎన్నారైలు విరివిగా పాల్గొంటే లక్ష్యాన్ని సాధించవచ్చని చెప్పారు. డిజిటల్ తరగతుల ఏర్పాటు వల్ల మన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్గొన్నారు.
దీనికి స్పందించిన పలువురు ఎన్నారైలు దాదాపు 125 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు తమవంతుగా విరాళాలను అందించారు. సునీల్ పంత్ర, సుధీర్ బచ్చు, రాంప్రసాద్ చిలుకూరి తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పాతూరి నాగభూషణం, జోగేశ్వరరావు పెద్దిబోయిన, కిరణ్ దుగ్గిరాల, వెంకట్ ఎక్కా, గంగాధర్ నాదెళ్ళ, రాజగోపాల్, నవీన్ ఎర్నేని తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.













