Robinhood Review: టైం పాస్ మూవీ ‘రాబిన్‌హుడ్’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నటినటులు : నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్
ఎడిటర్: కోటి, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రవివర్మ, విక్రమ్ మోర్, CEO: చిరంజీవి (చెర్రీ)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
విడుదల తేది : 28.03.2025
ఈ ఉగాది కానుకగా మన తెలుగు సినిమా నుంచి ఆడియెన్స్ ని అలరించడానికి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’. నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ అవైటెడ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు థియేటర్లలో విడుదల అయ్యింది. మరి గతం లో ఛలో, భీష్మ సినిమాలతో మంచి ఎంటర్టైనర్స్ ని అందించిన వెంకీ కుడుముల నుంచి మళ్ళీ నితిన్ తో చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
కథ :
తన చిన్ననాటి నుంచే అనాథ అయిన రామ్ (నితిన్) తన తోటి పిల్లల ఆకలి కష్టాలు చూసి బాగా డబ్బున్న వాళ్ళని ఇంట్రెస్టింగ్ ప్లాన్ లతో దోచుకుంటూ వారికి పంచిపెడుతూ ఉంటాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా గంజాయి సాగులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తే రాక్షసుడు సామీ (దేవదత్త నాగే) రుద్రవనం అనే ఊరులో అక్కడ పండించే గంజాయికి అత్యంత డిమాండ్ ఉందని ఆ ఊరినే తన సొంతం చేసుకొని ఎదురిచ్చినవారిని చంపి మరీ ఆ ఊరిలో వారితోనే గంజాయి సాగు చేయిస్తూ తన డ్రీం వైపు అడుగులు వేస్తుంటాడు. తనకి డబ్బు కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ కావాలని చూసే సామి ఆ రుద్రవనం ఊరికి పెద్ద దిక్కు అయినటువంటి వ్యక్తి (లాల్) అతని మనవరాలు నీరా వాసుదేవ్ (శ్రీలీల) ని ఆ ఊరికి కావాలని రప్పిస్తాడు.
అయితే ఈ రప్పించడం వెనుక ఉన్న కారణం ఏంటి? రామ్ అలాగే రాబిన్ హుడ్ గా పిలవబడే ఎందుకు ఒక దొంగలా మారాల్సి వస్తుంది. ఇండియన్స్ అంతా తన ఫ్యామిలీ అనే మోటివ్ పెట్టుకొని ఏం చెయ్యాలని చూస్తాడు? ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్న జనార్దన్ సున్నిపెంట (రాజేంద్ర ప్రసాద్) తో కలిసి శ్రీలీలని తీసుకొని రుద్రవనంకి వచ్చిన తర్వాత రాబిన్ హుడ్ డబ్బులు కోసం ఏం చేస్తాడు? విలన్ తో కూడా డీలింగ్ చేసి ఆమెని వదిలేస్తాడా లేదా అసలు తానే కావాలని రావాలనుకున్నాడా? ఈ అందరితో డ్రగ్స్ మాఫియా డాన్ డేవిడ్ (డేవిడ్ వార్నర్) పాత్ర ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
నటీనటుల హవబవాలు:
ఇక నటీనటుల విషయంకి వస్తే.. నితిన్ అదరగొట్టాడు. ఒక దొంగగా ఇంకోపక్క ఎమోషనల్ పాత్రలో ఒక సెక్యూరిటీ గార్డ్ గా కూడా ఇలా పలు షేడ్స్ లో బాగా చేసాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్ ఇంకా యాక్షన్ సన్నివేశాల్లో నితిన్ ఇంప్రెస్ చేస్తాడు. అలానే తనతో ట్రావెల్ అయ్యే రాజేంద్ర ప్రసాద్ గత సినిమాల్లో కంటే ఇందులో చాలా బాగా చేసినట్టుగా అనిపిస్తుంది. నితిన్ తో కొన్ని కామెడీ ట్రాక్స్ అలానే తనపై ఒకటీ రెండు సోలో ట్రాక్స్ కూడా అదరగొట్టేశారని చెప్పవచ్చు. ఇంకా గ్లామర్ బ్యూటీ శ్రీలీల విషయానికి వస్తే ఆమె రష్మిక మందన్న రోల్ ని రీప్లేస్ చేసినట్టు అందరికీ తెలిసిందే. అయితే ఆమె కొన్ని సీన్స్ బాగానే చేసింది. కానీ మరికొన్ని సీన్స్ లో మాత్రం రష్మికాని ఊహించుకుంటే నిజంగానే శ్రీలీల కంటే ఆమెనే బెటర్ ఛాయిస్ కదా ఈ సీన్స్ రష్మిక ఇంకా బెటర్ గా చేసేది అనిపించక మానదు. అయినప్పటికీ తనకున్నంతలో శ్రీలీల బాగానే చేసేసింది.
ఇక ఆదిపురుష్ నటుడు ఈ సినిమా విలన్ దేవదత్త నాగే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. ఆల్రెడీ తెలుగులో ఓ సినిమాలో విలన్ గా మెప్పించిన తాను ఈ చిత్రం లో కూడా అంతకు మించిన నెగిటివ్ పెర్ఫామెన్స్ ని తాను అందించారు. విలనిజంతో పాటుగా లాస్ట్ లో అమాయకత్వం కామెడీగా ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. ఇక సినిమాలో అంతా ఎదురు చూసిన అవైటెడ్ స్టార్ డేవిడ్ వార్నర్ కోసం చెప్పకుండా ఎలా? డేవిడ్ వార్నర్ కి వెంకీ మంచి రోల్ నే డిజైన్ చేస్తే దానిని డేవిడ్ భాయ్ కేజ్రీగా పండించారు. ఉన్న కొంచెం సేపే అయినప్పటికీ చిన్న చిన్న డైలాగ్స్ తో మంచి ఇంపాక్ట్ ని డేవిడ్ వార్నర్ చూపించి మంచి కిక్ ఇస్తారు. కాగా వీరితో పాటుగా వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో ఫుల్ ఫన్ జెనరేట్ చేస్తారు. ఇంకా షైన్ టామ్ చాకో మంచి రోల్ చేశారు కానీ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. వీరితో పాటుగా శుభలేఖ సుధాకర్, లాల్ ఇతర నటీనటులు తమ పాత్రలకి ఉన్న ప్రాముఖ్యత మేర బానే చేసేసారు. ఫైనల్ గా కేతిక శర్మ స్పెషల్ సాంగ్ లో తన అందాల ఆరబోతతో ఆడియెన్స్ కి మంచి కిక్ ఇస్తుంది.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు వెంకీ కుడుములకి మన తెలుగు సినిమాలో మంచి మార్క్. ఎంటర్టైన్మెంట్ తో కూడిన కథలు చెప్పగలిగే కొద్ది మంది దర్శకుల్లో తాను కూడా ఒకరు. ఆల్రెడీ లాస్ట్ రెండు సినిమాలకి ప్రూవ్ చేసుకున్న తాను ఈ సినిమాలో కూడా అదే మూమెంటంని కొనసాగించడం ఇంప్రెస్ చేస్తుంది. మెయిన్ గా తన బ్యాలెన్సింగ్ విధానం సినిమాలో బాగుంది. ఎక్కడికక్కడ సినిమాని ఏ ఎమోషన్ ని ఎంతవరకు క్యారీ చేయాలో అలానే తీసుకెళ్లారు. ఇక తన మార్క్ కామెడీ సీన్స్ అయితే సినిమాలో మంచి హిలేరియస్ గా పేలతాయి. మెయిన్ గా ఫస్టాఫ్ లో చాలా సీన్స్ ఇంటర్వెల్ ముందు వరకు భళే నవ్వులు తెప్పిస్తాయి. ఇక సెకండాఫ్ లో డీసెంట్ ఎమోషన్స్ సినిమాలో బాగున్నాయి. జి వి ప్రకాష్ మంచి బీట్స్ ఈ సినిమాకి అందించాడు. పాటలు, స్కోర్ అలాగే సెకండాఫ్ లో నితిన్ పై ఓ స్పెషల్ ట్రాక్ ని తాను బాగా డిజైన్ చేశారు. ఇంకా సాయి శ్రీరాం కెమెరా పనితనం సినిమాలో బాగుంది. పలు విజువల్స్ ని ప్రెజెంట్ చేసిన తీరు విజువల్స్ బాగున్నాయి. కోటి ఎడిటింగ్ లో అక్కడక్కడా కత్తెర వేయాల్సింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు అత్యున్నతంగా సినిమాలో అనిపిస్తాయి.
విశ్లేషణ :
రాబిన్‌హుడ్ దాదాపు అన్ని ఎమోషన్స్ కలిపిన డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. వెంకీ మార్క్ హిలేరియస్ సీన్స్ సహా పలు ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి. అలాగే మెయిన్ లీడ్ సహా నటుడు దేవదత్త నాగే మెస్మరైజ్ చేస్తారు. మొత్తమ్మీద చూసుకున్నట్టయితే ఈ రాబిన్ హుడ్ సినిమా ఒక ఎంటర్టైనింగ్ యాక్షన్ ఫ్లిక్ అని చెప్పుకోవచ్చు. కావాల్సినంత ఫన్ అందులోనే మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఇంకా బాగున్నాయి అనిపించే ఎమోషన్స్ సినిమాలో బలంగా కనిపిస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువగానే చూస్తున్న డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ అనేది సినిమాని ఒకింత రొటీన్ అనిపించేలా చేస్తుంది. కానీ మిగతా అంశాలు మాత్రం ఈ సినిమాలోకి ఆడియెన్స్ ఎంగేజ్ అయ్యేలా చేసి తీరుతాయి. ఏదో టైం పాస్ ఎంటర్టైనర్ ని చూడాలి అనుకునేవారికి రాబిన్ హుడ్ డీసెంట్ ట్రీట్ అందిస్తుంది.