HHVM P-1 Review: ‘హరి హర వీర మల్లు’ పార్ట్ 1 సరే! పార్ట్ 2 ఉంటుందా?

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : మెగా సూర్య ప్రొడక్షన్స్
నటీనటులు : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్,
జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహ తది తరులు నటించారు.
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్, కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి, నృత్య దర్శకత్వం: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ – లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
సమర్పణ: ఎ. ఎం. రత్నం, నిర్మాత: ఎ. దయాకర్ రావు
దర్శకత్వం: జ్యోతి కృష్ణ , క్రిష్ జాగర్లమూడి
విడుదల తేది : 24.07.2025
నిడివి : 2 ఘంటల 43 నిముషాలు
దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటించిన ఈ పీరియడ్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. న్యాయం, ధర్మం కోసం పోరాడిన వీరుడు చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడు గా తన ప్రయాణాన్ని హిస్టారికల్ ఫిక్షన్ గా భారీ బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎ. ఎం. రత్నం (A M Rathnam)నిర్మించారు. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి (Directors Jyothi Krishna and Kriss Jagarlamudi)దర్శకులు కాగా బాబీ డియోల్(Bobby Deaol) ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్,(Nidhi Agarwal) నర్గీస్ ఫఖ్రీ, (Narigis Fhakri)నోరా ఫతేహి(Nora Fathehi) వంటి అద్భుతమైన తారాగణం నటించింది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (M M Keeravani)సంగీతం సమకూర్చారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. నా సినిమాలను నేనే చూడనన్నాడు నాటి పవన్ కళ్యాణ్. కానీ నేటి డిప్యూటీ సీఎం అయ్యాక.. క్షణం తీరిక లేకున్నా కూడా.. ‘వినాలి.. వీరమల్లు చెప్తే వినాలి’ అంటూ తన సినిమాని తానే ప్రమోట్ చేసుకుంటూ స్వయంగా వీరమల్లు ప్రమోషన్స్‌కి దిగారు. తాను దిగడమే కాదు.. జనసైనికులు, కూటమి కార్యకర్తలతో గ్రామ, మండల స్థాయిలో ర్యాలీలు చేయించి మరీ ప్రమోషన్స్ చేయించి.. ‘వీరమల్లు’ విజయంపై గట్టిగానే గురిపెట్టారాయన. మరి ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రేక్షకుడిని ఈ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
కథ :
‘హరి హర వీరమల్లు’ సినిమా కథ ఫిక్షనల్ స్టోరీ. చరిత్రతో ఏ మాత్రం సంబంధం లేని కల్పిత పాత్రతో అల్లిన ఊహాతీతమైన కథ. 16- 17వ శతాబ్ధం బ్యాక్ గ్రౌండ్ లో వుంటుంది. హరి హర వీరమల్లు (పవన్ కళ్యాణ్) పెద్దోళ్లను కొట్టి పేదలకు పెట్టే బందిపోటు. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం కుతుబ్ షాహీల దగ్గర నుంచి మొఘలాయిల దగ్గరకు వెళుతుంది. అక్కడ నుంచి ఈ కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే బాధ్యతను హైదరాబాదీ కుతుబ్ షాహీ నవాబు.. హరి హర వీరమల్లు కు అప్పగిస్తుంది. అంతకు ముందు హైదరాబాదీ నవాబు సైన్యానికి తన పవర్ ఏంటో చూపిస్తాడు వీరమల్లు. దీంతో మొఘలాయి చక్రవర్తులలో అత్యంత క్రూరుడైన ఔరంగజేబు (బాబీ డియోల్) దగ్గరున్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడానికి హైదరాబాద్ సంస్థానం నుంచి ఢిల్లీకి బయలు దేరుతాడు. అప్పటికే ఔరంగజేబు ఇస్లాంలోకి మారని హిందువులపై జిజియా పన్ను సహా వివిధ రకాల దురాగతాలకు పాల్పడుతాడు. శత్రు దుర్భేద్యమైన ఔరంగజేబు సామ్రాజ్యంలో హరి హర వీరమల్లు ఎలా ప్రవేశించాడు. ఈ క్రమంలో మొఘలాయిల సైన్యంతో హరి హర వీరమల్లు ఎలాంటి పోరాటం చేసాడు. హిందువులుగా బతకాలంటే జిజియా పన్ను కట్టాలన్న ఔరంగజేబును ఎలా ఎదుర్కొన్నాడు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి హైదరాబాద్ కు తీసుకొచ్చాడా లేదా ఈ క్రమంలో పంచమి (నిధి అగర్వాల్ ) పాత్ర ఏమిటి..? అనేదే ‘హరి హర వీరమల్లు’ పార్ట్ -1 సోర్డ్ అండ్ స్పిరిట్ స్టోరీ.
నటీనటుల హవబావాలు:
పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హరి హర వీరమల్లు గా తన ఎఫర్ట్ మొత్తం కనిపిస్తోంది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు. అభిమానులకు ఏదైతే కావాలో అదే అందించాడు. ముఖ్యంగా ఫైట్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ కష్టం కనిపిస్తోంది. వస్తాదులతో పోరాట సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఓవర్ అల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో మూవీ ఇది. పంచమి గా నటించిన నిధి అగర్వాల్ మొదట దేవదాసిగా కనిపించి.. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సర్ ప్రైజ్ చేసింది. హావభావాలను రంగరించే పాత్రయే కాదు కాబట్టి. ఆమెకు వాటితో పెద్దగా పని పడలేదు కానీ.. ఆమె మేకప్ అయితే డ్రామా ఆర్టిస్ట్‌ల కంటే ఘోరంగా ఉంది. స్క్రీన్‌పై చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ క్రూరత్వాన్ని చూపించాడు. అందర్నీ డామినేట్ చేసిపారేశాడు. సినిమాలో అతనికి పూర్తిగా నటించే ఛాన్స్ రాలేదు. దివంగత కోట శ్రీనివాస రావు దొర తండ్రిపాత్రలో కనిపించాడు. వీరమల్లు కథ మొదలయ్యేది సత్యరాజ్‌తోనే. యుద్ధ విద్యలు తెలిసిన పురోహితుడిగా ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించారు. సెకండాఫ్ కోసం బంధీగా ఉన్న ఇతని పాత్రను దాచిపెట్టారనుకుంటా! సునీల్ ఉన్నంతలో నవ్వంచే ప్రయత్నం చేసాడు. మిగిలిన పాత్రల్లో నాజర్, సుబ్బరాజు, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, అనసూయ ఇలా చాలామందే నటీనటులు వాళ్ల పాత్రల్ని వాళ్లు చేసుకుంటూ పోయారు.
సాంకేతికవర్గం పనితీరు :
చారిత్రక కోహినూర్ వజ్రం చుట్టూ ఓ కథను అల్లడం దాన్ని పవన్ కల్యాణ్ ను ఒప్పించడంతో సగం సక్సెస్ సాధించాడు క్రిష్. ఈ సినిమా ఒక మహా భారతం అనుకుంటే… మొదట నన్నయ్య మొదటి రెండున్నర పర్వాలు రాసాడు. ఆ తర్వాత మిగిలిన 15 పర్వాలను తిక్కన పూర్తి చేసాడు. ఇక రెండున్నరలో మిగిలనదాన్ని ఎఱ్ణాప్రగడా పూర్తి చేసినట్టు, క్రిష్ మొదలుపెట్టిన ఈ కథను దర్శకుడు జ్యోతికృష్ణ పూర్తి చేసాడు. మధ్యలో ఎర్రన్నలాగా పవన్ కళ్యాణ్ కొంత భాగాన్ని డైరెక్ట్ చేశారు. మొత్తంగా ఈ సినిమా స్టోరీ నేరేటివ్, క్రియేటివిటి అంతా ప్రాజెక్ట్ తీసుకు వచ్చిన క్రిష్ కు దక్కాల్సిందే. ఇక ఎంఎం కీరవాణి, రాజమౌళి సినిమాలకు కొట్టినంత బాగా బయట సినిమాలకు మ్యూజిక్ ఇవ్వరనే టాక్ ఉంది. అయితే వీరమల్లు సినిమాతో ఆ టాక్‌ని చెరిపేసుకోవాలనే ప్రయత్నమో ఏమో కానీ.. తన నేపథ్య సంగీతంతో నార్మల్ సీన్లను కూడా హై రేంజ్‌కి తీసుకుని వెళ్లారు. ముఖ్యంగా క్లైమాక్స్ వార్ సీన్‌కి మొత్తం బాదిపారేశారు. వీరమల్లుకు కీరవాణి మ్యూజిక్కే బ్యాక్‌బోన్. సాంగ్స్ పర్వాలేదు. మరీ గుర్తించుకుని మళ్లీ మళ్లీ పాడుకునేంత గొప్ప మ్యూజిక్ అయితే ఇవ్వలేదు. పాటలకంటే బుర్రా సాయి మాధవ్ మాటలు బాగా పేలాయి.
పవర్ స్టార్ కోసం చాలానే పవర్ ఫుల్ డైలాగ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ‘జనం మెచ్చే సైనికుడు అవుతాడు’.. ‘పాలించే వారి పాదాలే కాదు..తల కూడా కనిపించాలి’ ‘వినాలీ.. వీరమల్లు చెప్తే వినాలీ’ అనే పవన్ పొలిటికల్ కెరీర్, వ్యక్తిత్తత్వాన్ని ప్రతిబింబించేలా డైలాగులు థియేటర్స్ లో ఈలలు వేయిస్తాయి. ఈ సినిమా రన్ టైమ్ భారంగా అనిపిస్తుంది. పార్ట్ 2 కోసం కథని సాగదీసినట్టుగానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ.. గ్రాఫిక్స్ జోడొద్దుల ప్రయాణం లాంటివి. ఒకటి ముందుకెళ్లి.. ఒకటి వెనుకున్నా.. రెండూ వెనకబడ్డట్టే. ఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస కెమెరా వర్క్ బాగున్నా.. గ్రాఫిక్స్‌లో చెడగొట్టేశారు. మంగళగిరిలోనే ఓ గోడౌన్‌లో సెట్ వేసి గ్రీన్ మ్యాట్‌లోనే కీలక సన్నివేషాలను, యాక్షన్ ఎపిసోడ్‌లను చిత్రీకరించామని చాలా గొప్పగా చెప్పారు పవన్ కళ్యాణ్. కానీ.. ఆ గోడౌన్‌లో చేసిని గ్రీన్ మ్యాట్ VFX గ్రాఫిక్ సీన్లే వీరమల్లుని ట్రోలింగ్ బాట పట్టిస్తాయి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే అంత ఘోరంగా ఉంది ఆ VFX వర్క్. ఈ సినిమా పలు వాయిదాల పడ్డాయంటే.. క్వాలిటీ వీఎఫ్‌ఎక్స్ కోసం అని మేకర్స్ చెప్పిన మాట. అయినా సరే ఫైనల్ ఔట్‌పుట్‌లో క్వాలిటీ అయితే కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే.. ఇటీవల కాలంలో ఆదిపురుష్, కన్నప్ప సినిమాల VFX వర్క్‌పై విమర్శలు వచ్చాయి కానీ.. వీరమల్లు వాటికేం తక్కువేం కాదు అన్నంత నాసిరకంగా ఉంది గ్రాఫిక్ వర్క్.
విశ్లేషణ :
ఔరంగజేబు క్రూరత్వం, కోహినూర్ వజ్రం కోసం వీరమల్లు పోరాటం. ఈ రెండింటి మధ్య అంతర్లీనంగా ధర్మం కోసం జరిగిన యుద్ధం. చెప్పడానికి ఇదో చారిత్రక ధర్మ పోరాటం అనేట్టుగానే ఉంది కానీ.. ఆ ఆర్భాటమేది టేకింగ్‌లో ప్రజెంట్ చేయలేకపోయారు. ఫస్టాఫ్‌లో కథని మొదలుపెట్టిన తీరు.. పాత్రల్ని పరిచయం చేసిన విధానం చూస్తే దర్శకుడు క్రిష్ వేసిన పునాది గట్టిదే అనే నమ్మకం కలిగింది. కానీ కథ ముందుకు వెళ్తున్నకొద్దీ క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న లోటు అయితే స్పష్ఠంగా కనిపించింది. ఫస్టాఫ్‌లో ఔరంగజేబు అరాచకాలను చూపించిన తరువాత.. అతని దగ్గరే ఉన్న కొహినూర్ వజ్రం కోసం వీరమల్లు వేట సెకండాఫ్‌లో మొదలౌతుంది. ఇక కథ క్లైమాక్స్‌కి వచ్చాక.. తిరిగి ఎక్కడ మొదలైందో అక్కడే ఆగుతుంది. చాల ఘోరంగా ఉన్నాయి సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్లు. మధ్యలో హిందూ ధర్మ రక్షణ అనే మంచి పాయింట్ టచ్ చేసినా.. దాన్ని బలంగా చూపించలేకపోయారు.
కోహినూర్ వజ్రంతో మొదలైన వీరమల్లు కథ ట్రాక్ తప్పి సనాతన ధర్మం వైపు వెళ్లిపోతుంది. క్లైమాక్స్ లో ఔరంగజేబు పాత్రతో ఆందీ వచ్చాడంటూ ప్రధాని మోడీ చెప్పిన విషయాన్ని ఇందులో ప్రస్తావించడం పవన్ అభిమానుల కోసం పెట్టినట్టు ఉంది. పోనీ అక్కడైనా ఉందా అంటే.. క్లైమాక్స్‌లో జౌరంగజేబు, వీరమల్లు తలబడేవరకూ తీసుకుని వెళ్లి ఎండ్ కార్డ్ వేసేసి పార్ట్2లో చూసుకోండి.. మళ్లీ హరిహర వీరమల్లు యుద్థభూమిలో కలుద్దామనేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలను ఆయన ఫ్యాన్స్ ఎంతలా ఆరాధిస్తారో.. ఇంకెంత ప్రేమిస్తారంటే.. ఆయన కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తే హౌస్ ఫుల్ చేసిన ఘన చరిత్ర ఉంది. ఎవరు ఏమనుకున్నా కూడా.. ఫ్యాన్స్‌కి మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉన్నా నచ్చేస్తుంది.