Viswambhara: విశ్వంభర గురించి ఎదురుచూస్తుంటే స్టాలిన్ ను రీరిలీజ్ చేస్తున్నారు

మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్ లో వస్తోన్న విశ్వంభర (Viswambhara) సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులవుతుంది. వాస్తవానికైతే విశ్వంభర ఈ పాటికే థియేటర్లలోకి రావాల్సింది. కానీ మేకర్స్ అసలు ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. అప్పుడెప్పుడో గతేడాది చిరూ బర్త్ డేకు టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ అందులోని వీఎఫ్ఎక్స్ విషయంలో తీవ్ర విమర్శల పాలయ్యారు.
దీంతో ఏకంగా వీఎఫ్ఎక్స్ టీమ్‌నే మార్చారు మేకర్స్. అప్పట్నుంచి ఇప్పటికి పది నెలలవుతుంది. ఇప్పటికీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయంటున్నారు తప్పించి అసలు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. మధ్యలో రామ రామ అనే లిరికల్ ను రిలీజ్ చేశారు కానీ అది కూడా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది.
ఇప్పుడు మళ్లీ చిరూ బర్త్ డే వస్తోంది. ఈసారి చిరూ బర్త్ డే కు అయినా విశ్వంభర రిలీజవుతుందనుకుంటే ఫ్యాన్స్ అంచనాలను తారు మారు చేస్తూ స్టాలిన్ ను రీరిలీజ్ చేస్తున్నారు తప్పించి అసలు విశ్వంభర గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ ఇచ్చేలా కనిపించడం లేదు. దీంతో అసలు విశ్వంభర ఈ ఏడాది వస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు చిరూ మాత్రం అనిల్ రావిపూడితో తన నెక్ట్స్ మూవీని చేస్తూ ఆ సినిమాను చకచకా పూర్తి చేస్తూ సంక్రాంతికి రీలిజ్ చేస్తున్నాడు.