ట్రైలర్ లేకపోతే ఏం జరుగుతుంది? ప్యారడైజ్ చెప్పిన పాఠమిదే!
సినిమా ప్రమోషన్స్‌లో ట్రైలర్‌కు ఉన్న ప్రాధాన్యం మరోసారి డిస్కషన్‌కు వచ్చింది. ప్యారడైజ్(The paradise) ను ట్రైలర్ రిలీజ్ చేయకుండానే ఆడియన్స్ ముందుకు తీసుకురావడం ఆసక్తిని రేకెత్తించింది. కథ, క్యారెక్టర్లు, వరల్డ్ గురించి ఎలాంటి ముందస్తు అవగాహన లేకుండా నేరుగా థియేటర్లో ఎక్స్‌పీరియెన్స్ చేసే అవకాశం ఇవ్వాలన్న ఆలోచనగా దీన్ని చూశారు. అయితే సినిమా రిలీజైన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఈ ప్రయోగంపై కొత్త డిస్కషన్ కు దారితీసింది. ముఖ్యంగా సినిమా ఏ నేపథ్యంపై సాగుతుంది? పాత్రలు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి? అనే విషయాలు ముందుగానే ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పకపోవడం కొంత ప్రతికూలంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్యారడైజ్ లోని ప్రపంచం, అక్కడి సవారీల జీవితం, వారి బాధలు కథలో కీలకమైన అంశాలు. అలాగే హీరో రెండు జడలతో కనిపించడం వెనుక ఉన్న కారణం కూడా సినిమాలో ఓ ప్రత్యేకమైన అంశంగా నిలుస్తుంది. అయితే వీటిపై ముందస్తుగా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో థియేటర్లో జరుగుతున్న పరిణామాలను ఆడియన్స్ వెంటనే అర్థం చేసుకోవడానికి కొంత టైమ్ పట్టిందనే డిస్కషన్ నడుస్తోంది. ఫలితంగా పాత్రల భావోద్వేగాలు, వారి పోరాటం ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదనే అభిప్రాయం సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
ఇక్కడ అసలు ప్రశ్న ట్రైలర్ ఉంటే సినిమా హిట్ అయ్యేదా? అనేది కాదు. సినిమా కంటెంట్ ఎలా ఉన్నా ఫలితాన్ని పూర్తిగా మార్చే శక్తి ఒక్క ట్రైలర్‌కు ఉండదు. కానీ సినిమా ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతోంది, ఎలాంటి కథను చెప్పబోతోంది అనే విషయంపై ఆడియన్స్ ను ముందుగానే రెడీ చేయడం మాత్రం ప్రమోషన్స్‌లో కీలకంగా మారేది. ఆ అవగాహన లేకుండా థియేటర్లోకి వచ్చినప్పుడు కొన్ని ప్రయోగాత్మక సినిమాలను అర్థం చేసుకోవడానికి ఆడియన్స్ కు ఎక్స్ట్రా టైమ్ అవసరం కావచ్చు. ప్యారడైజ్ విషయంలో ఇదే అంశం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన డిస్కషన్‌గా మారింది.








