వివాదంగా మారిన సినిమా నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి!
క్రికెట్లో స్పిన్ బౌలింగ్ అంటేనే ఒక చిత్రమైన ప్రక్రియ. అందుకే దీన్ని మాయాజాలంతో పోలుస్తారు. ఎందుకంటే ఒక స్పిన్ బౌలర్ వేసిన బంతి ఎటు నుంచి ఎటు వెళ్తుందీ, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించే లోపే ఆ బ్యాట్స్‌మెన్ ఔట్ చేయడం ఈ బౌలింగ్ ప్రత్యేకత. దానిలో నిష్ణాతులైన వారు కొంతమందే కనిపిస్తారు. వారిలో శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ ఒకరు. టెస్ట్ క్రికెట్లో 800 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు మురళీ. ఈమధ్యకాలంలో ప్రముఖ వ్యక్తుల జీవిత కథలతో సినిమాలు రూపొందుతున్నవిషయం తెలిసిందే. అందులో భాగంగానే మురళీధరన్ జీవిత కథ ఆధారంగా `800` పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రను విజయ్ సేతుపతి పోషిస్తున్నాడని.. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. శ్రీపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా ఇటీవల విడుదల చేశారు.
ఇంతవరకు బాగానే వుంది కానీ, ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి తమిళనాడులో ఎన్నో వివాదాలు చెలరేగుతున్నాయి. జాతి వివక్షను పాటించే ప్రభుత్వానికి మద్దుతు పలికే వ్యక్తి జీవిత కథతో రూపొందిస్తున్న సినిమాలో విజయ్ సేతుపతి నటించడాన్ని తమిళ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారతీరాజా, రాధికలాంటి సినీ ప్రముఖులు సైతం విజయ్ సేతుపతి ఆ సినిమాలో నటించడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై రాద్దాంతం జరుగుతోంది. ఈ సినిమాలో నటించొద్దని విజయ్ సేతుపతిని అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతికి ఓ లేఖ రాశాడు మురళీధరన్. తన బయోపిక్‌లో నటించవద్దని ఆ లేఖలో కోరాడు. తన కథతో రూపొందే సినిమా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుందనుకున్నాను తప్ప ఇంత గొడవ జరుగుతుందని అనుకోలేదన్నాడు. తన వల్ల విజయ్‌కి ఎలాంటి ఇబ్బందీ కలగకూడదని కోరుకుంటున్నానని ఆ లేఖలో పేర్కొన్నాడు. మురళీధరన్ రాసిన లేఖపై విజయ్ సేతుపతి స్పందిస్తూ.. `థ్యాంక్యూ గుడ్ బై` అని సమాధానమిచ్చాడు. ఈ ఒక్కమాటతో విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని అర్థమవుతోంది.













