సమ్మర్ టార్గెట్‌గా రంగంలోకి దిగుతున్న రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్!
గత ఆరు నెలలుగా కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు అక్టోబర్ 15 నుంచి తెరుచుకుంటాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దర్శకనిర్మాతలు తమ తమ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని ఆరాటపడుతున్నారు. ఈ సంవత్సరం థియేటర్లకు అనుమతి ఇవ్వరన్న ఉద్దేశంతో పెద్ద హీరోలు జనవరి వరకు షూటింగులకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా థియేటర్లకు అనుమతి ఇవ్వడంతో వారు కూడా షూటింగులకు హాజరు కాక తప్పడం లేదు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ ని కూడా లైన్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇంతకుముందే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యాలని చాలా సార్లు అనుకున్నాడు.
కానీ, పరిస్థితులు అనుకూలించకపోడం, లొకేషన్ల సమస్య, భారీ వర్షాలు తదితర కారణాల వల్ల రాజమౌళి అనుకున్నది జరగలేదు. కానీ, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ చెయ్యాల్సిందేనని చిత్ర యూనిట్ సభ్యులందరికీ చెప్పాడట. దీంతో ఎలర్ట్ అయిన నటీనటులు, సాంకేతిక నిపుణులు షూటింగ్‌కి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ సరసన అలియాభట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ ఓలియా మోరిస్ నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరు షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్నారని తెలుస్తోంది. అయితే ఆచార్య చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న చరణ్ ఆ సినిమాలో తన పార్ట్ పూర్తయిన తర్వాత ఆర్ ఆర్ ఆర్ సెట్స్‌కి వచ్చే అవకాశం ఉంది. దాదాపు నెలరోజుల పాటు ఆచార్య షూటింగ్లో పాల్గొంటాడు చరణ్. అలాగే ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్లో చేయబోయే సినిమా షూటింగ్‌కి అటెండ్ అవుతాడు. నాన్‌స్టాప్‌గా బ్యాలెన్స్ వర్క్ అంతా పూర్తి చేసి సమ్మర్లో సినిమాను రిలీజ్ చెయ్యాలని రాజమౌళి భావిస్తున్నాడు. దానికి చిత్ర యూనిట్ కూడా రెడీ అవడంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.













