బ్రేకప్ అనేది కష్టమైన ఫీలింగ్
లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్ళకే పరిమితం కావడంతో ఎప్పుడూ బిజీగా ఉండేవారికి కావాల్సినంత సమయం చిక్కింది. ముఖ్యంగా ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినిమా తారలకు తమ అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించే అవకాశం, వారి అభిప్రాయాలను తెలుసుకునే వీలు కలిగింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన అభిమానులతో లైవ్‌లో ప్రేమ గురించి, బ్రేకప్ గురించి తన మనసులోని మాటలను బయట పెట్టింది రేణు దేశాయ్.
“లవ్ అనే పదం చాలా కాంప్లికేటేడ్. లవ్ బ్రేకప్ అనేది ఒక్కో వ్యక్తి విషయంలో ఒక్కోలా ఉంటుంది. ఇలాంటి ఎమోషన్స్ గురించి మన పెద్దవారుగానీ, స్కూల్లోగానీ నేర్పించరు. దాంతో ఈ సమస్యను ఎలా డీల్ చెయ్యాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది. లవ్ బ్రేకప్ అనేది చాలా కష్టమైన ఫీలింగ్. దానిని తట్టుకోవాంటే చాలా మానసిక ధృడత్వం ఉండాలి. మనకు డాక్టర్లు, మానసిక వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ అలాంటి సమస్య నుంచి బయటపడాలంటే మన వంతు కృషి మనం చేయాలి. ఆ బాధ నుంచి నేను బయటపడ్డాను.
మనకు ఏదైనా జరగకూడని విషయం జరిగినపుడు దాని గురించే పదే పదే ఆలోచించడం వల్ల మానసికంగా బలహీన పడిపోతాం. అలా కాకుండా ఆ సమయంలో వేరే విషయాలపైన దృష్టి పెట్టాలి. మనకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడాలి. ఆహారంపై దృష్టి పెట్టాలి. అప్పుడు మానసిక సుస్థిరత ఏర్పడుతుంది.
మన సమాజంలో కులం వల్ల అనేక సమస్యలు వెలుగు చూస్తున్నాయి. సమాజాన్ని కులం ఎంతో ప్రభావితం చేస్తోంది. ఎక్కువ శాతం ప్రేమ వైఫల్యాలకు ప్రధాన కారణం కులం కావడం ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తోంది’’ అంటూ తన అభిప్రాయాలను వెల్లడించారు రేణు దేశాయ్.













