గబ్బర్ సింగ్ కు పవన్ సాయం
పవన్ బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ కానున్న గబ్బర్ సింగ్ గురించి ఇప్పుడెన్నో విశేషాలు బయటికొస్తున్నాయి. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమా వెనుక ఉన్న పలు విషయాల్ని బయటపెట్టారు. అయితే గబ్బర్ సింగ్ సినిమా విషయంలో త్రివిక్రమ్ ప్రమేయముందని ఆయన వివరించారు.
దబాంగ్ బ్లాక్ బస్టర్ అయినప్పుడు తీన్ మార్ షూటింగ్ టైమ్ లో సోను సూద్ దాన్ని కొనమని సూచించడంతో పవన్ కు చెప్పకుండానే గణేష్ ఆ సినిమా హక్కుల్ని కొన్నాడు. దాన్ని పవన్ నిర్మాతగా హరీష్ దర్శకత్వంలో ప్లాన్ చేసుకుని ఫోటో షూట్ కూడా చేశారు. తర్వాత ఓ రోజు త్రివిక్రమ్, పవన్ ఇద్దరూ బండ్ల గణేష్ ను పిలిచి ఈ సినిమాను తననే ప్రొడ్యూస్ చేసుకోమని చెప్పారని, అలా ఆ సినిమా కార్యరూపం దాల్చిందని బండ్ల గణేష్ తెలిపారు.
అయితే త్రివిక్రమ్ చెప్పకపోయినా పవన్ బండ్ల గణేష్ తో మరో సినిమాను తీసేవారు. 2011లో వచ్చిన తీన్మార్ ఫ్లాపైంది. నిర్మాతగా ఆ సినిమాతో బండ్ల గణేష్ చాలా నష్టపోయాడు. ఆ సినిమాకు రైటర్ గా సంభాషణలు రాసింది త్రివిక్రమే. దాని వల్ల నష్టపోయాడు కాబట్టి మళ్లీ రికవర్ అవాలంటే మరో హిట్ సినిమా పడాలనే ఉద్దేశంతో గబ్బర్ సింగ్ సినిమాకు అవకాశమిచ్చారు. గబ్బర్ సింగ్ అందరి అంచనాలను మించి అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను సృష్టించింది. అంతేకాదు బండ్ల గణేష్ ఈ సందర్భంగా గతంలో త్రివిక్రమ్ పై అసందర్భంగా చేసిన కొన్ని కామెంట్లకు మనస్పూర్తిగా క్షమాపణలు చెప్తున్నానని కూడా ఈ ప్రెస్మీట్ లో చెప్పాడు.













