దయచేసి ఇలాంటి ప్రచారం చేయవద్దు
నేను మొండివాడిని. నా గురించి ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోగలను. కానీ, మా ఇంట్లో వాళ్లను, నా అభిమాన, బంధుకోటిని ఇబ్బందిపెట్టే హక్కు ఎవరికీ లేదు. నిజానిజాలు తెలుసుకోకుండా నా ఆరోగ్యం విషమించిందని అబద్ధపు ప్రచారం చేయకండి అని ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఊపిరితిత్తులు పాడయ్యానని, గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారనీ సోషల్ మీడియలో వార్తలు ప్రచారమయ్యాయి. వాటిని ఖండిస్తూ కోట శ్రీనివాసరావు హైదరాబాద్‌లో మీడియాతో సమావేశమయ్యారు. నాకిప్పుడు 74 ఏళ్లు. కాళ్లు నొప్పొ, కంటి నొప్పో రాదా? అయినా నాకు తెలిసిన వాళ్లు హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్లాను? నేను కాదు ఎవరైనా హాస్పిటల్‌కి వెళ్లరా? హాస్పిటల్‌కి వెళ్లినంత మాత్రాన ప్రాణాంతక వ్యాధులు ఉన్నట్టేనా? వార్తలు ప్రచారం చేయడానికి ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఇది నా ఒక్కడి విషయంలో జరుగుతున్నది కాదు. ఇటీవల గాయని సునీల గారి విషయంలోనూ ఇదే జరిగింది. దయచేసి ఇలాంటి అబద్ధపు ప్రచారం చేయవద్దు. ఆర్టిస్టులు సున్నితమనస్కులు. వారినీ, వారి కుటుంబాన్ని ఆందోళనకు గురిచేయవద్దు అని కోట అన్నారు. ప్రస్తుతం బాలకృష్ణుడు, ఆచారి అమెరికా యాత్ర, జవాన్‌లో నటించినట్లు తెలిపారు. త్వరలో స్వామి స్వ్వయర్ సినిమా సెట్స్‌కు వెళ్లనున్నట్లు చెప్పారు.













