నాడు ఖుష్బు.. నేడు కత్రీనా బాధితులు.. బాడీ షేమింగ్ నేరమని తెలిసినా ఆగరే..
ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ అందానికి ప్రాధాన్యమిస్తారు. అందులో మహిళలు మరికాస్త ప్రాణంగా చూసుకుంటారు. దీనిలో భాగమే జీరో సైజ్.. సిక్స్ ప్యాక్.. ఇక సినిమా స్టార్స్, సెలబ్రిటీస్ అయితే.. వారికి ఫిట్ నెస్ చాలా అవసరం. లేదంటే వారి కెరియర్ అక్కడితో ముగిసిపోతుంది. అందుకే నాజూగ్గా ఉండేందుకు తగిన శిక్షణ, డైట్ పాటిస్తారు. కానీ.. సమయం గడిచేకొద్దీ.. క్రమంగా ఆ అందం చెరిగిపోతుంది. దాని స్థానంలో వయసుతో పాటు వచ్చే హుందాతనం వరిస్తుంది. దాన్నే మనం మెచ్యూరిటీ అంటాం. అయితే.. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేని కొందరు మహిళల శరీరాకృతిలో ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే అవాకులు, చవాకులు పేలతారు.
నటి కత్రినా కైఫ్ (Katrina Kaif) శరీరాకృతిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఆమెపై వచ్చిన ట్రోల్స్‌ను ఖండిస్తూ పలువురు సినీ ప్రముఖులు నటికి మద్దతుగా నిలిచారు. ఈ అంశంపై కత్రినా పరోక్షంగా స్పందించారు. తన దృష్టిలో అందం అంటే ఆరోగ్యంగా ఉండడమేనని అన్నారు.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రారంభంలో కఠినమైన అందాల కొలతలకు ప్రాధాన్యం ఇచ్చేదాన్నని.. అయితే సమయంతో పాటు అందంపై తన దృక్పథం పూర్తిగా మారిపోయిందని కత్రినా తెలిపారు. ‘‘నేను పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో అందం అంటే.. ఇలానే ఉండాలి అని కొన్ని నియమాలు పెట్టుకున్నాను. కానీ, ఇప్పుడు నా దృష్టిలో అందంగా ఉండటం అంటే.. మనకి మనం ఉన్నతంగా కనిపించడమే. మన శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకుంటూ.. మనసును ప్రశాంతంగా ఉంచడమే అసలైన సౌందర్యం. పైకి కనిపించేది అందం కాదు.. మనం ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నామనేది ముఖ్యం’’ అని కత్రినా అన్నారు.
ప్రసవానంతరం బరువు పెరిగారంటూ కత్రినా కైఫ్‌పై వచ్చిన ట్రోల్స్‌ను సెలబ్రిటీలు ఖండిస్తున్నారు. నటి ఖుష్బూ కూడా దీనిపై పోస్ట్ పెట్టారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు రావడం సహజమని, దానిని అర్థం చేసుకోకుండా హేళన చేయడం సరికాదని హితవు పలికారు. గతంలో తాను కూడా ఇలాంటి బాడీ షేమింగ్ విమర్శలను ఎన్నోసార్లు ఎదుర్కొన్నానని తెలిపారు. మహిళలు తమను తాము ప్రేమించుకోవడం ముఖ్యమన్నారు. అదే విమర్శకులకు మనమిచ్చే గట్టి సమాధానమని చెప్పారు.








