సీఎం చంద్రబాబు ఆదేశాలు బేఖాతర్.. ఆ మంత్రుల ఫోటోలకు చోటేది..?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో సరికొత్త సంస్కరణలతో పాటు ప్రోటోకాల్ పాటించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రభుత్వ అధికారిక ప్రకటనల్లోగానీ, పోస్టర్లలోగానీ ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని, కేవలం సీఎం, డిప్యూటీ సీఎంల ఫోటోలే కాకుండా సంబంధిత శాఖల మంత్రుల ఫోటోలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కొద్ది రోజుల క్రితమే సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం సీఎం ఆదేశాలు బేఖాతర్ అవుతున్నాయనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. తాజాగా విడుదలవుతున్న ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రుల ఫోటోలు కనుమరుగవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అధికారిక ప్రభుత్వ యాడ్స్, సోషల్ మీడియా పోస్టర్లలో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మరియు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫోటోలకే అత్యధిక ప్రాధాన్యం లభిస్తోంది. ఒకానొక దశలో మిగిలిన కేబినెట్ మంత్రుల ఉనికి ఎక్కడా కనిపించడం లేదనే అసంతృప్తి వ్యక్తమవడంతో.. స్వయంగా సీఎం స్పందించి ప్రోటోకాల్ మార్గదర్శకాలు ఇచ్చారు. ఏ శాఖకు సంబంధించిన ప్రకటన విడుదలైనా, ఆ శాఖా మంత్రి ఫోటో అందులో కచ్చితంగా ఉండాలని సూచించారు. కానీ, సీఎం అంతటి వ్యక్తి గట్టిగా హెచ్చరించిన తర్వాత కూడా తాజా ప్రభుత్వ ప్రకటనల్లో సంబంధిత మంత్రుల ఫోటోలకు చోటు దక్కకపోవడం చూస్తుంటే.. సీఎం ఆదేశాలను అధికారులు ఏమాత్రం లెక్కచేయడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మొత్తం వ్యవహారంలో సమాచార, పౌర సంబంధాల శాఖ (I & PR) తీరుపై ఇప్పుడు సచివాలయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రభుత్వ ప్రకటనలను డిజైన్ చేసి విడుదల చేయాల్సిన ఐఅండ్‌పీఆర్ శాఖ.. ప్రోటోకాల్ అమలు చేయడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీఎం ఆదేశాల తర్వాత కూడా తమకు దక్కాల్సిన కనీస ప్రాధాన్యత లభించకపోవడంపై కేబినెట్లోని పలువురు మంత్రుల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అధికారులు ఇలా లైట్ తీసుకోవడం కూటమి ప్రభుత్వ సమన్వయ లోపానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకనైనా ఐఅండ్‌పీఆర్ శాఖ తన తీరు మార్చుకుని, ప్రోటోకాల్‌ను పక్కాగా అమలు చేయకపోతే మంత్రుల అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది.








