మోదీపై మరోసారి కమల్ విమర్శలు
సినీ నటుడు కమలహాసన్ మరోసారి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. మక్కల్నీదిమయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ నోట్ల రద్దు నిర్ణయం తరహాలోనే అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించారని ఆరోపించారు. నాడు నోట్ల రద్దుతో పేద ప్రజల పొట్టకొట్టారని, నేడు లాక్ డౌన్ కారణంగా జీవనోపాధితో పాటు జీవితాలే గల్లంతవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీరు దీపాలు వెలిగించమంటే మీ వాళ్లు బాల్కనీల్లో ఎంచక్కా మంచినూనెతో దీపాలు వెలిగించారు, కానీ పేదలు మాత్రం రొట్టెలు చేసుకునేందుకు నూనె దొరక్క అవస్థలు పడుతున్నారు. మీ ప్రసంగాలు కూడా బాగానే ఉన్నాయి. బాల్కనీలు ‘ఉన్న’వాళ్ల భయాలు తొలగించేందుకు మీ ప్రసంగాలు ఉపయోగపడుతున్నాయి, కానీ, నెత్తిన పైకప్పు తప్ప మరేమీ లేని బడుగుల మాటేమిటి.. జీడీపీకి ప్రధాన వనరు అనదగ్గ పేదవాళ్లను విస్మరించడం తగదు. అలాంటివారిని అణగదొక్కాలని జరిగిన ప్రయత్నాలకు చరిత్రలో ఎలాంటి జవాబులు వచ్చాయో మీరు తెలుసుకోవాలని అన్నారు. చైనాలో తొలి కరోనా కేసు వచ్చినప్పటి నుంచి మీరు ఎందుకు స్పందించలేదు.. మీ దార్శనికత ఏమైంది.. హడావుడిగా లాక్ డౌన్ నిర్ణయం ప్రకటించారు. దార్శనికత ఉన్న నాయకులైతే సమస్య తీవ్రతరం కాకముందే స్పందిస్తారు. ఈ విషయంలో మీరు విఫలం అయ్యారనే భావిస్తున్నాం అంటూ లేఖలో విరుచుకుపడ్డారు.













