సినిమా వారి కష్టాలు తీరే అవకాశం ఇప్పట్లో లేనట్టేనా?
కరోనా ఉధృతి దేశవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ జనజీవనంలో ఎలాంటి మార్పూలేదు. సాధారణ పరిస్థితుల్లో ఎలాంటి రద్దీ ఉంటుందో అలాంటి రద్దీ ప్రతి సెంటర్లోనూ కనిపిస్తోంది. అన్ని బిజినెస్‌లు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీ మాత్రం భారీగానే నష్టపోతోంది. ఏం చేయాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలీని పరిస్థితిలో దర్శకనిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఉన్నారు. సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు. థియేటర్లు ఓపెన్ చెయ్యడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని అందరికీ తెలిసిన విషయమే.
ఇదిలా ఉంటే మరో పక్క కొంత మంది నిర్మాతలు తమ సినిమాల షూటింగులను తిరిగి ప్రారంభించారు. కొన్ని సినిమాలను సంక్రాంతి విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు ఈ సంవత్సరం అంతా ఇంతే ఉంటుందని, కొత్త సంవత్సరంలో సినిమా థియేటర్లు ఓపెన్ అయిపోతాయని అందరూ భావించారు.
కానీ, ఇప్పట్లో ఆ పరిస్థితి వచ్చేలా కనిపించడం లేదు. అయితే ఇప్పటికే నష్టాల్లో ఉన్న నిర్మాతలు ఆగిపోయిన తమ సినిమాల షూటింగులను తిరిగి ప్రారంభించడం వల్ల వారి మీద మరింత భారం పడే అవకాశమే ఉంది తప్ప భవిష్యత్తులో సినిమా రిలీజ్ చేసుకునే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయనే విషయంలో ఎవ్వరికీ క్లారిటీ లేదు. పెద్ద హీరోల సినిమాల విషయానికి వస్తే వారు చేస్తున్న సినిమా పూర్తయి అది రిలీజ్ అయితేనే నెక్స్ట్ సినిమా చేసేందుకు వారికి ఉత్సాహం ఉంటుంది. అయితే పెద్ద హీరోలు మాత్రం తాము చేయబోయే సినిమాల లిస్ట్‌ను ప్రకటించేస్తున్నారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్, ప్రభాస్ వంటి హీరోల సినిమాల లిస్టు బాగానే ఉంది. అందరికీ అందుబాటులోకి కరోనా వ్యాక్సీన్ వచ్చిన తర్వాతే దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి.
అయితే ఆ అవకాశం కనుచూపు మేరలో లేదనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే వ్యాక్సీన్ విషయంలో తొందరపాటు నిర్ణయం సరికాదు కాబట్టి ప్రభుత్వం ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఫలానా రోజు వరకు వ్యాక్సీన్ వచ్చేస్తుందని చెప్పలేకపోతోంది. సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు బాగుంటుందని, మునుపటి రోజులు తిరిగి వస్తాయని సినీ పెద్దలు ఎంత ధైర్యం చెప్పుకున్నా సినిమా వారు ఈ కష్టాల నుంచి ఇప్పట్లో బయటపడే అవకాశం కనిపించడం లేదు.













