Hema Committee: సరైన వాంగ్మూలం లేకపోవడంతో హేమ కమిటీ కేసులు క్లోజ్

2017 కొచ్చిలో ఓ మలయాళ నటి కిడ్నాప్ మొత్తం ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. యాక్టర్ దిలీప్(Dileep) ఆమెపై రౌడీలతో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత మాలీవుడ్ లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ అధ్యక్షతన ఓ స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది.
దీంతో ఆ కమిటీ మాలీవుడ్ లో మహిళలు ఎదుర్కొంటున్న పలు విషయాలపై అధ్యయనం చేసి, కొందరు ఇచ్చిన వాంగ్మూలాలతో మొత్తం 235 పేజీల నివేదికను కేరళ గవర్నమెంటుకు నివేదించింది. హేమ కమిటీ(Hema Committee) నివేదిక తర్వాత మలయాళ ఇండస్ట్రీలోని ఎంతో మంది తాము ఎదుర్కొంటున్న సమస్యలను బయటికొచ్చి గొంతువిప్పి చెప్పగా, ఈ అంశాలన్నీ మాలీవుడ్ లో సంచలనం సృష్టించాయి.
హేమ కమిటీ రిపోర్ట్ ఆధారంగా 35 కేసులు నమోదవగా, వాటిపై దర్యాప్తు జరిపేందుకు సిట్(SIT) ఏర్పాటైంది. తాజాగా ఆ 35 కేసులను క్లోజ్ చేస్తున్నట్టు సిట్ కేరళ హైకోర్టు(Kerala High court)కు తెలిపింది. ఆ 35 కేసులకు సంబంధించిన బాధితులెవరూ వాంగ్మూలం ఇవ్వడానికి ముందుకు రాకపోవడం వల్ల ఈ కేసులను మూసి వేస్తున్నట్టు సిట్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అలాగే ఆ కేసులను మూసివేయాలని హైకోర్టు ఆదేశించింది.