ధనుష్ ఒకటనుకుంటే మరొకటి అయింది
టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తన ప్రస్తుతం తమిళ స్టార్ నటుడు ధనుష్ తో ఓ సినిమాను చేస్తున్నాడు. ధనుష్ కెరీర్లో 51వ సినిమాగా తెరకెక్కుతున్ ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నాడు. ధనుష్ సరసన రష్మిక మందన్నా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. లవ్ స్టోరీ నిర్మాత అయిన సునీల్ నారంగ్ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న మొదటి మల్టీస్టారర్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాతో శేఖర్ కమ్ముల తన రూట్ మార్చి మొదటిసారి యాక్షన్ ప్రధానంగా సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి నాగార్జున, ధనుష్ కాంబినేషన్లో ఇంతకుముందే సినిమా రావాల్సింది.
ధనుష్ డైరెక్టర్ గా మారి చేసిన పవర్ పాండి సినిమా మంచి హిట్ అయ్యాక, తర్వాత రుద్ర పేరుతో సినిమాను చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. రుద్ర లో నాగార్జున ఒక కీ రోల్ పోషించాల్సింది. కానీ బడ్జెట్ కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. కానీ ఇప్పుడు అదే కాంబో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతుంది. మొత్తానికి ధనుష్ తన దర్శకత్వంలో నాగ్ తో సినిమా చేయాలనుకుంటే అది వేరేలా జరిగింది.













