మామి అధ్యక్షురాలుగా దీపికా పదుకొణె
బాలీవుడ్ అగ్ర కథానాయికగా దూసుకుపోతోంది దీపికా పదుకొణె. పద్మావత్ చిత్రంతో ఆమె కీర్తి మరింత పెరిగింది. తాజాగా ఆమెకు మరో గౌరవం దక్కింది. మామి (ముంబయి అకాడెమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్) చిత్రోత్సవాలకు కొత్త అధ్యక్షురాలిగా దీపిక నియమితురాలైంది. ఈ విషయాన్ని మామి డైరెక్టర్ అనుపమ చోప్రా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవమే కాదు, అంతకంటే పెద్ద బాధ్యత కూడా. సినిమా ప్రేమికుల్ని, సినీ ప్రముఖుల్నీ ఒక్కచోటకు చేర్చే మామి ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళతాను అని చెప్పారు దీపిక. గత నాలుగేళ్లుగా ఆమీర్ ఖాన్ భార్య, దర్శకురాలు కిరణ్‌రావ్ ఈ పదవిలో ఉన్నారు. ఈ సందర్భంగా కిరణ్‌రావ్ స్పందిస్తూ నాలుగేళ్లు మామి కి సేవలు అందించడం ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్న దీపిక కొత్త అధ్యక్షురాలు కావడాన్ని స్వాగతిస్తున్నాను అన్నారు. ఓ కొత్త సినిమాతో బిజీగా ఉండటంతోనే కిరణ్‌రావ్ ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం.













